పార్లమెంటులోకి ‘జేడీ’ వెళ్లినట్టేనా..?

July 10, 2020

విశాఖపట్నం నుంచి దిల్లీ పార్లమెంటుకు అడుగు పెట్టేది జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణయేనా...? ‘డౌటే అక్కర్లేదు. ఆయన గెలిచినట్టే’నని, జనసేన పార్టీ ధీమాగా ఉంది. రాజకీయ పరిశీలకులు, ఎన్నికల ‘జ్యోతిష్కులు’ కూడా ఇదే మాట చెబుతున్నారు. ఇందుకు ఆధారంగా కొన్ని అంశాలను వారు ఎత్తి చూపుతున్నారు. వాటిని ఒకటొక్కటిగా చూద్దాం.

1. విశాఖపట్నం మొత్తం పట్టణ ప్రాంతం. ఉన్నతాధికారిగా, నీతిమంతుడిగా, నిజాయితీపరుడిగా, సామాజికవేత్తగా జేడీ లక్ష్మీనారాయణకు మంచి పేరు ఉంది. పట్టణంలోని ఉన్నత-మధ్యతరగతి శ్రేణి ఓటర్లకు ఇవి బాగా నచ్చుతాయి. విశాఖపట్నం ఎంపీ పరిధిలో విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, విశాఖ పడమర, గాజువాక, భీమిలి, శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో శృంగవరపు కోట మినహా మిగిలినవన్నీ పట్టణ ప్రాంతాలే. భీమిలిలో కూడా సగం అర్బన్, సగం గ్రామీణ ప్రాంతం ఉంది. పట్టణ ప్రాంత ఓటర్లు అన్నీ ఆలోచించిన తరువాతనే ఓటేస్తారు. విశాఖలో స్థానికులతో పాటు స్థానికేతరులు, ఉత్తరాది వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారంతా, లక్ష్మీనారాయణ వైపు మొగ్గారు. మిగతా ముగ్గురిని (టీడీపీ నుంచి బాలకృష్ణ మేనల్లుడు శ్రీభరత్, బీజేపీ నుంచి పురందేశ్వరి, వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ) ఒకే గాటన కట్టారు.
2. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాపు ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. అసెంబ్లీ అభ్యర్థుల్లో తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసినప్పటికీ, ఎంపీ విషయానికి వచ్చేసరికి మాత్రం లక్ష్మీనారాయణ వైపు మొగ్గు చూపారు. కాపులే కాదు... విద్యావంతులు, పార్టీలకతీతంగా ఉండే తటస్థులు కూడా లక్ష్మీనారాయణ వైపే మొగ్గారు. భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగింది.

3. 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలిచారు. వైసీపీ నుంచి విజయమ్మ నిలబడ్డారు. ఆమె ఓటమికి మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది- ఆమె, నాన్ లోకల్. రెండవది- ఆమెను గెలిపిస్తే.. రాయలసీమ నేతల పెత్తనం పెరుగుతుంది. మూడవది- రాయలసీమ నుంచి ‘కత్తులు-కటార్లు-కొడవళ్లు-గొడ్డళ్లు-బాంబులు’ దిగుతాయేమోనన్న భయం. ఈసారి, విద్యావంతుడైన లక్ష్మీనారాయణ నిలబడ్డారు. గత ఎన్నికల్లో హరిబాబు వైపు మొగ్గినట్టుగానే, ఈసారి జేడీ వైపు మొగ్గారు.
4. తాను ఓడినా, గెలిచినా విశాఖలోనే ఉంటానని, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని లక్ష్మీనారాయణ ప్రకటించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానో వివరిస్తూ 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇది, సోషల్ మీడియాలో విస్త్రుతంగా ప్రచారమైంది. ఇవన్నీ, జేడీ లక్ష్మీనారాయణకు అనుకూలించాయి.