పవన్ ఈ షాక్..  ఊహించిఉండడు

May 31, 2020

జనసేన పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారీ ఓటమిని కూడా తట్టుకుని ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ కు తాజా దెబ్బ పెద్దదే అని చెప్పాలి. పార్టీ కీలక నేత జేడీ లక్ష్మినారాయణ ఆ పార్టీని వీడుతున్నారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా లేఖ సమర్పించారు. తాను పార్టీ వీడటానికి కారణం పార్టీ అధినేత పవన్ తప్ప మరెవ్వరు కారణం కాదని ఆయన కుండబద్ధలు కొట్టారు. ఒక్క ముక్కలో తన నిర్ణయాన్ని క్లారిటీగా చెప్పేశారు. ’మీరు అనేక సార్లు ఇకపై సినిమాలు చేయను. నా జీవితం రాజకీయానికే అంకితం అని చెప్పారు. కానీ మళ్లీ సినిమాలు చేస్తున్నారు. దీన్ని బట్టి మీకు నిలకడ లేదని అర్థమవుతోంది. కానీ నేను పార్టీ వీడాలి అనుకుంటున్నాను’’ అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ కు తన లేఖను రాశారు. అయితే... వైజాగ్ లో ఎన్నికల్లో తనకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి తాను వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానని, నాకు ఓటువేసిన వారికి, నా సహాయం కోరేవారికి అన్నివేళలా అందుబాటులో ఉంటాని ఆయన పేర్కొన్నారు. 

లక్ష్మినారాయణ రాజకీయాలకు పూర్తిగా అంకితం అవుతానని వీఆర్ఎస్ తీసుకుని వచ్చి జనసేనలో చేరారు. ఇలాంటి సమయంలో పవన్ తన సినిమాలు తాను చేసుకోవడం జేడీని హర్ట్ చేసినట్టుంది. ఈ విషయం పక్కన పెడితే రాష్ట్రంలో జేడీ విశ్వసనీయత ఉన్న వ్యక్తి. అతను పార్టీని వీడటం జనసేనకు నైతికంగా పెద్ద దెబ్బ. పవన్ పై జేడీ ఎటువంటి విమర్శలు చేయకపోయినా... నిలకడ లేని వ్యక్తి అన్న ఒక్క మాటతో తాను పవన్ ఇమేజ్ పై దెబ్బ కొట్టారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ గాని, పార్టీ గాని ఎలా స్పందిస్తుందో చూడాలి. వాస్తవానికి ఎన్నికల తర్వాత వీరిద్దరికి సంబంధాలు సన్నగిల్లాయి. ఆయన పవన్ తో కలిసి పెద్దగా వేదికల్ని పంచుకోలేదు. పవన్ చేపట్టిన కార్యక్రమాలకు జేడీ హాజరు కాలేదు. దీంతో ఎప్పటికైనా జేడీ పార్టీ వీడతారని ప్రచారం జరిగింది. అదిపుడు నిజమైంది.