ఆర్జీవీ బయోపిక్.. టైటిల్ వచ్చేసింది

August 07, 2020

తనకు నచ్చని వాళ్లను, నచ్చిన వాళ్లను.. అందరినీ టార్గెట్ చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. సాఫ్ట్ టార్గెట్స్ ఎంచుకుని ఆయన చేసే అతి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ స్పీచ్ అంటూ ఏం తోచితే అది మాట్లాడుతుంటాడు.. ఏది పడితే అది తీసి పడేస్తుంటాడు. ఐతే ఆయన్ని కౌంటర్ చేయడం అంటే బురదలో రాయి వేయడమే అన్నట్లుగా చాలామంది సైలెంటుగా ఉండిపోతుంటారు.

కానీ సీనియర్ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుమాత్రం అలా ఊరుకోవట్లేదు. ‘కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా తీసినపుడు వర్మ మీద జొన్నవిత్తుల విమర్శలు చేయడం.. దానికి బదులుగా వర్మ ఆయనపై కుల ముద్ర వేసి డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నంచేయడం.. ఇద్దరి మధ్య టీవీ చర్చల్లో తీవ్ర వాగ్వాదాలు జరగడం తెలిసిన సంగతే. ఐతే ఆ వ్యవహారం అంతటితో సద్దుమణిగిపోలేదు. అందరినీ టార్గెట్ చేసే వర్మను జొన్నవిత్తుల టార్గెట్ చేశారు. వర్మ మీద సినిమా తీయడానికి రెడీ అయిపోయారు.

శ్రీరామ నవమిని పురస్కరించుకుని టైటిల్ కూడా అనౌన్స్ చేశారాయన. వర్మ బయోపిక్‌కు ‘ఆర్జీవీ’ అనే టైటిలే పెట్టి.. దానికి క్యాప్షన్‌గా RGV అనే అక్షరాలు కలిసేలా ‘అందరినీ గిల్లే వాడు’ అని పెట్టారాయన. తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లుగా తన పిచ్చి ఇజంతో యువతను పెడదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని జొన్నవిత్తుల చెప్పారు. ఐతే వర్మ అనే వ్యక్తి మీద అందరికీ ఆసక్తి పోయి ఆయన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్న తరుణంలో ఆయన మీద సినిమా తీస్తే చూడ్డానికి ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది సందేహమే.