వారెంట్ లేకుండా లేడీ జర్నలిస్టు అరెస్టు ?

October 16, 2019

తెలంగాణలో జర్నలిస్టులకు పెద్దగా వాయిస్ ఉండట్లేదు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యమే చేయలేని పరిస్థితిలో తెలంగాణ జర్నలిస్టులు ఉన్నారు. ఇటీవల టీవీ9 ఎపిసోడ్ చూశాం. ఆ తర్వాత కేసీఆర్ అనుకూలురే మోజో టీవీని కూడా బలవంతంగా కొన్నట్లు ఆ టీవీ మాజీ సీఈవో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె లైవ్ లో ధర్నా చేసింది. మొత్తానికి మోజో కూడా చేతులు మారిపోయింది. ఇదిలా ఉండగా... జనవరిలో నమోదైన కేసులో ఎ2 గా ఉన్న తనను ఇపుడు కక్ష సాధింపు మీద వారెంట్ లేకుండా అరెస్టు చేశారని మాజీ సీఈవో రేవతి ఆరోపించింది.
తెలంగాణలోని కార్పొరేట్ కంపెనీల ద్వారా పోలీసులు జర్నలిస్టులను వేధిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే కల్పించుకోవాలని మోజో టీవీ మాజీ సీఈఓ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈ ఉదయం అరెస్టయిన రేవతి డిమాండ్ చేశారు. ఉదయాన్ని ఇంటికి వచ్చిన పోలీసులు పాపను స్కూలుకు పంపే సమయం కూడా ఇవ్వలేదని, నేను ఏమైనా టెర్రరిస్టునా? అని ఆమె ప్రశ్నించారు. వారెంట్ లేకుండా అప్పటికపుడు తక్షణం అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.
ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ల ద్వారా పోలీసుల వేధింపులను ఆమె వివరించారు. మెగా సంస్థల అధినేత కృష్ణారెడ్డి, మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వరరావు తమ తెలివితేటలను అద్భుతంగా ఉపయోగించారని, నిజం ఇవాళ కాకపోయినా, రేపయినా బయటకు వస్తుందని ఆమె వారిపై ఆరోపణలు చేశారు. నిజాన్ని కొంతకాలం దాచగలరు గాని నాశనం చేయలేరు అన్నారు. నా కనీస హక్కులు హరిస్తున్నారని, ఫోన్ ను లాక్కునే ప్రయత్నం కూడా చేశారని, పోలీసులను వీడియో తీయబోతే అడ్డుకున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు.