​మంచి నిర్ణయం ​తీసుకుంటే తప్పేంటి... జేడీకి జేపీ క్లాస్

February 22, 2020

జనసేనలో ఎవరు బయటకు పోయినా పెద్ద రచ్చ అవుతోంది. చివరకు జేడీ వంటి సౌమ్ముడు సైలెంటుగా బయటకు పోదామని చాలా చిన్న కారణం వెతికి చెప్పినా... అదే పెద్దగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని... సినిమాలు చేయను అని చెప్పి మళ్లీ చేయడమే దానికి నిదర్శనం కాబట్టి నేను జనసేనను వీడుతున్నాను అని జేడీ వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ స్పందించారు. సినిమాలు పార్టీకోసం, కుటుంబం కోసం తనపై ఆధారపడిన వారికోసం చేస్తాను అన్నారు. 

ఈవిషయంలో అందరూ పవన్ కు మద్దతు తెలిపారు. పవన్ చేస్తున్నదాంట్లో తప్పులేదు. అందరికీ ఆదాయ మార్గాలు ఉంటాయి. అవి సక్రమం అయ్యుండాలి. పవన్ సినిమాలు చేసుకోవడాన్ని తప్పు పట్టడం జేడీ చేసిన తప్పు అంటూ జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యానించారు. పవన్ ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలిసిన విద్యలో నిజాయితీగా సంపాదించుకుంటున్నపుడు దానిపై ఇతరులు అభ్యంతరం తెలపడం తప్పని అన్నారు. 

జేపీయే కాదు చాలామంది పవన్ పనిలో తప్పులేదన్నారు. టీడీపీ నేత సోమిరెడ్డి దీనిపై స్పందిస్తూ... జేడీని తప్పుపట్టారు. ‘‘లక్ష్మీ నారాయణ గారూ..ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం. పవన్ కళ్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ... రాజకీయ నాయకులు నిజజీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.’’ అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. నటుడు అంబికా కృష్ణ కూడా పవన్ నిర్ణయాన్ని సమర్థించారు.