పోలీసు కానిస్టేబుల్ బట్టలిప్పించిన జడ్జిని ఏం చేశారంటే...

November 14, 2019

న్యాయమూర్తిగా తన అధికారాలను ఉపయోగించడంలో తప్పు లేకున్నా పరిధులు దాటి అమానవీయంగా ప్రవర్తించడంతో చిక్కుల్లో పడ్డారో న్యాయమూర్తి. తన కారుకు దారివ్వలేదన్న కారణంతో పోలీసు శాఖలో డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబులుతో బట్టలు విప్పించి నిల్చోబెట్టిన జడ్జిని ఉత్తరప్రదేశ్ హైకోర్టు బదిలీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో శుక్రవారం ఉదయం పోలీసు శాఖలో డ్రైవరుగా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఘరేలాల్ ఇద్దరు విచారణ ఖైదీలను, ముగ్గురు కానిస్టేబుళ్లను పోలీసు వ్యానులో ఎక్కించుకుని కోర్టుకు బయలుదేరాడు. మరో వంద మీటర్లు ప్రయాణిస్తే వ్యాను కోర్టుకు చేరుకుంటుందనగా వెనక జడ్జి కారు వచ్చింది. జడ్జి కారు దారి కోసం హారన్ మోగించినప్పటికీ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వ్యాను డ్రైవర్‌ ఘరేలాల్‌కు దారివ్వడం సాధ్యం కాలేదు. దీంతో జడ్జికి ఆగ్రహం వచ్చేసింది. కోర్టుకు చేరుకోగానే కానిస్టేబుల్ ఘరేవాల్‌ను తన గదికి పిలిచిన జడ్జి దారివ్వనందుకు తీవ్రంగా ఆగ్రహించారు. ఆయన యూనిఫాం, బెల్టు విప్పించి అరగంటపాటు నిల్చోబెట్టి అవమానించారు.
38 ఏళ్లుగా సర్వీసులో ఉన్న 58 ఏళ్ల ఘరేలాల్‌ తనకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేకపోయారు. వెంటనే ఆగ్రా పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్‌ బబ్లూ కుమార్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. తనకు జరిగిన అవమానాన్ని ఆయనకు వివరించిన ఘరేలాల్ స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు. ఘరేలాల్‌కు జరిగిన అవమానంపై స్పందించిన ఎస్సెస్పీ బబ్లూకుమార్ జడ్జిపై ఆగ్రా జిల్లా జడ్జి అజయ్ కుమార్ శ్రీవాస్తవకు, అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయాంక్ కుమార్‌ జైన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ కూడా జడ్జి తీరును తప్పుబట్టారు. పోలీసుల గౌరవ మర్యాదలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఎస్సెస్పీ ఫిర్యాదుపై స్పందించిన  అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మయాంక్ కుమార్‌ జైన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆగ్రా జడ్జిని బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.