జగన్ బిగ్గెస్ట్ యూటర్న్.. ఏపీనే నిలువునా ముంచేసింది

April 03, 2020

రాజకీయాల్లో యూటర్న్ అనేది అందరికీ సర్వసాధారణ విషయంగా మారిపోయింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తన ప్రత్యర్థులంతా యూటర్న్ పొలిటీషియన్ అంటున్నా.. ఆయన తీసుకునే యూటర్న్ లు ఆయనను మాత్రమే ముంచేసేవి. బాబు యుటర్న్ వల్ల బాబుకు నష్టం గాని రాష్ట్రానికి ఏవీ నష్టం కాదు. అయితే ఇప్పుడు కొత్తగా యూటర్న్ నేతగా మారిపోయిన వైసీపీ అధినేత ఏకంగా ఐదు కోట్ల మందిని ప్రభావితం చేశారు. జగన్ తీసుకున్న యూటర్న్.. తనను కాకుండా ఏపీని, ఏపీ ప్రజలను నిట్ట నిలువునా ముంచేసింది. జగన్ యూటర్న్ తో నిండా మునిగిన ఏపీ ఎప్పుడు కోలుకుంటుందో కూడా చెప్పడం సాధ్యం కావడం లేదు. అంతేనా... జగన్ తీసుకున్న ఒక్క యూటర్న్ ఏపీని ఇంకెంతగా ముంచేస్తుందోనన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

జగన్ తీసుకున్న యూటర్న్ ఏమిటో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికలకు ముందు నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుంచి తరలించబోనని, తాను గెలిచినా కూడా ఏపీ రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తానని ప్రకటించారు. జగన్ చెప్పిన ఈ మాట నిజమేనని నమ్మిన జనం... ప్రత్యేకించి టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా, గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఆయన పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అయితే జగన్ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కదా. ఎన్నికల్లో గెలిచి సీఎం సీటును దక్కించుకోవాలన్న సింగిల్ అజెండాతోనే సాగిన జగన్... తన కల సాకారం కాగానే.. యూటర్న్ తీసుకున్నారు. రాజధాని అమరావతిని ఓ ముక్కగా మిగిలించేసి... తనకు లబ్ధి చేకూరేందుకు విశాఖను రాజధానిగా చేయనున్నట్లుగా ప్రకటించారు. 

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం... ఆయన విషయంలో బిగ్గెస్ట్ యూటర్న్ గానే చెప్పాలి. తనకు ఓట్లేసేలా ప్రజలను మభ్యపెట్టిన జగన్... తన లక్ష్యం నెరవేరగానే.. మాట మార్చేశారు. దీంతో రాజదాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగానే మారిపోయింది. అంతేకాకుండా రాజధాని అమరావతి కోసం బాబు గీసిన ప్లాన్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారంతా ఇప్పుడు వెనక్కెళ్లిపోయారు. ఆంటే జగన్ తీసుకున్న బిగ్గెస్ట్ యూటర్న్ తో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితే కనిపించడం లేదు. వెరసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధో:పాతాళానికి పడిపోయినట్టేన్న మాట. అంటే జగన్ నిర్ణయంతో ఏపీతో పాటు ఏపీ ప్రజలు కూడా నిండా మునిగిపోయినట్టేనన్న మాట.