జూపల్లితో అల్లు జట్టు... ఇంత మసాలా ఉందా?

August 13, 2020

తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ లో అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఓ రేంజి స్థానమున్నట్లే లెక్క. మెగాస్టార్ చిరంజీవి బావగానే కాకుండా బడా నిర్మాతగా, ఇద్దరు కుమారులను హీరోలుగా ఎంట్రీ ఇప్పించేసి... సొంత బ్యానర్ చిత్రాలతో బాగానే సంపాదిస్తున్న అల్లు అరవింద్... ఆదివారం తెలంగాణలో బడా పారిశ్రామికవేత్త, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుతో జట్టు కట్టేశారు. ఈ కొత్త జట్టుతో తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా అల్లు అరవింద్ మరింత దగ్గరయ్యారన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

అల్లు అరవింద్, జూపల్లి రామేశ్వరరావుల జట్టు కొత్తగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తదితర ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ల తరహాలో అచ్చ తెలుగు యాప్ 'ఆహా' అందుబాటులోకి తెచ్చేసింది. జూపల్లి రామేశ్వరరావు కంపెనీ మై హోమ్ గ్రూప్, అల్లు అరవింద్ కంపెనీ గీతా ఆర్ట్స్ సంస్థలు తయారు చేసిన ఈ యాప్ ప్రారంభోత్సవం ఆదివారం సందడిగా సాగింది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. జూపల్లితో అల్లు వారి జట్టుతో భవిష్యత్తులో మరిన్ని కొత్త కలయికలకు నాందీ పలకడం ఖాయమేనన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

ఇక జూపల్లి, అల్లు వారి జట్టుతో ఎంట్రీ ఇస్తున్న ‘ఆహా’ యాప్ ద్వారా రోజుకు కేవలం 1 రూపాయితో వినోదాన్ని ఆస్వాదించవచ్చట. ఇది పక్కా బోల్డ్ కంటెంట్ ఉండే యాప్ అని, ఈ మాట చెప్పడానికి తానేమీ మొహమాట పడటం లేదని అల్లు అరవింద్ అన్నారు. ఈ యాప్ ను పేరెంటల్ గైడెన్స్ తోనే వినియోగించుకోవాలని సూచించారు. బెంగాలీ భాషలో అందుబాటులో ఉన్న రీజనల్ ఆన్ లైన్ ఎంటర్ టెయిన్ మెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ 'హోయ్ చోయ్' తమకు స్ఫూర్తని అన్నారు. ఈ యాప్ లో కొత్త సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయినా బడా సంస్థలు చేతులు కలిపి జనం మీదకు బోల్డ్ కంటెంట్ ను వదులుతామని చెప్పడం వినడానికే విడ్డూరంగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.