ఎన్ కౌంటర్ : సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఒకేమాట

April 03, 2020

కాలం మారుతోంది. దీనికి తగ్గట్లే ప్రజల ఆలోచన తీరులో పరిణితి చోటు చేసుకోవటమే కాదు.. కొన్ని ఉదంతాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్న విషయంపై వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఒకే మాట మీద నిలవటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. దేశాన్ని కుదిపేసిన దిశ ఎన్ కౌంటర్ ఘటనపై సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ అందరి నోట ఒకటే మాట రావటం.. అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఎవరూ ఊహించని రీతిలో ఎన్ కౌంటర్ మీద వచ్చిన తొలి పాజిటివ్ రియాక్షన్ సీపీఐ సీనియర్ నేత నారాయణగా చెప్పాలి. హక్కుల స్తోత్రాల్ని పక్కన పెట్టేసి.. ఎన్ కౌంటర్ ను స్వాగతించటమే కాదు.. మంచి పని చేశారన్న మెచ్చుకోలు ఆయన నోటి నుంచి వచ్చింది. ఎన్ కౌంటర్ పై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఎన్ కౌంటర్ పై తాజాగా స్పందించారు ప్రముఖ నటి కమ్ పొలిటీషియన్ ఖుష్బూ సుందర్.
ఎవరైనా సరే తన కుమార్తెల జోలికి వస్తే ఇలాగే చంపేందుకు తాను సిద్ధపడేదానినని ఆమె పేర్కొన్నారు. ఎన్ కౌంటర్ అంశంపై టీవీ ఛానల్ తో మాట్లాడిన ఆమె.. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. దిశను నిప్పంటించిన చోటే ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకోవటం గమనార్హం.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించారు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో తన కామెంట్ ను పోస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. సజ్జనార్ పది కాలాల పాటు చల్లగా ఉండాలన్నారు.
సినిమాలకు సంబంధించి ట్రైలర్లు.. టీజర్లు పట్టించుకోకున్నా ఫర్లేదు.. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వార్తను మాత్రం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అందరికి తెలిసేలా ఈ విషయాన్ని చాటింపు వేయాలని అభిమానులను కోరారు. సెలబ్రిటీల స్పందన ఇలా ఉంటే.. సామాన్యుల సంతోషం మామూలుగా లేదు. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున సానుకూల స్పందనలు చోటు చేసుకుంటున్నాయి.