ట్విట్టర్ లో అలా చేసిన సింధియా.. కాంగ్రెస్ కు షాక్

June 01, 2020


దేశంలోని కొన్ని రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఆయా కుటుంబాల పేర్లు చెప్పినంతనే రాజకీయ పార్టీల పేర్లు చెప్పేసే పరిస్థితి. అలాంటి కోవకే వస్తారు జ్యోతిరాదిత్య సింధియా. ఆయన పేరు విన్నంతనే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ పేరు గుర్తుకు వస్తుంది. అంతలా పార్టీతో మమేకమైన ఆయన.. రాహుల్ గాంధీ గ్రూపులో ఆయన అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తారని చెబుతారు.
అలాంటి జ్యోతిరాదిత్య సింధియా తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో చేసిన మార్పులు పెనుసంచలనంగా మారాయి.  తన ట్విట్టర్ ఖాతాలో నుంచి తన ప్రొఫైల్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించారు. ఇదో హాట్ టాపిక్ గా మారింది. సింధియా పేరు ముందు కాంగ్రెస్ పార్టీ అన్న పేరు మిస్ కావటంతో మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగానే పెను దుమారంగా మారింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై భారీ చర్చ సాగుతోంది.
అయితే.. దీనిపై సింధియా స్పందన వేరుగా ఉంది. నెల రోజుల క్రితమే తాను తన ప్రొఫైల్ లో మార్పులు చేశానని చెప్పారు. తన బయోడేటాను మార్చాలని ప్రజల కోరారని.. దీంతో తన పేరును మార్చినట్లుగా చెప్పారు. తన మీద వస్తున్న పుకార్లను నమ్మొద్దని చెబుతున్నారు. అయితే.. ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ పేరును తీసివేయటం వెనుక ఎలాంటి రాజకీయాల్ని లేవంటున్నారు. ఇదిలా ఉంటే.. సింధియా పేరు ముందు ఉండాల్సిన పార్టీ పేరు ఎందుకు మిస్ అయ్యిందన్న విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం.. ముఖ్యమంత్రి పీఠంపై ఆయన కూర్చుంటారని చెప్పినా.. అనుభవంతో పాటు సీనియార్టీ ప్రాతిపదికన కమల్ నాథ్ కు అవకాశం ఇచ్చారు. దీనిపై సింధియా హర్ట్ అయ్యారంటారు. రాహుల్ బుజ్జగింపులతో ఆయన మెత్తబడినప్పటికీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో జ్యోతిరాదిత్య విసుగు చెందినట్లుగా చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని జ్యోతిరాదిత్యకు ఇస్తారని భావించినా.. దివంగత అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పేరు రావటంపై మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో తనకున్న ఆగ్రహాన్ని తాజా చర్యతో అందరికి తెలిసేలా చేశారంటున్నారు. రాహుల్ టీంలో కీలకనేత అయిన జ్యోతిరాదిత్య  చర్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.