కాంగ్రెస్ లో ఉంటే లక్ష్యాన్ని సాధించలేను...!

May 29, 2020
CTYPE html>
కొద్ది రోజులుగా మధ్య ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతోపాటు కాంగ్రెస్ కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు గాయబ్ కావడంతో మధ్యప్రదేశ్ రాజకీయ వాతావరణం  ఒక్కసారిగా వేడెక్కింది. సింధియాతో పాటు ఆ 17 మంది బీజేపీలో చేరబోతున్నారని, కమల్ నాథ్ సర్కార్ ను పడగొట్టేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిస్తూ....తాజాగా కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సింధియా....తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. సింధియా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
మధ్య ప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కు సింధియాకు మధ్య అభిప్రాయభేదాలున్నాయని ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన సింధియాను కాదని ....కమల్ నాథ్ ను సోనియా సీఎంను చేశారు. దీంతో, తీవ్ర అసంతృప్తితో ఉన్న సింధియా....కొంతకాలంగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కాంగ్రెస్ నేత అనే ట్యాగ్ ను సింధియా తీసివేయడం చర్చనీయాంశమైంది.  కాంగ్రెస్ కు సింధియా గుడ్ బై చెప్పబోతున్నారని ఆ సందర్భంలో టాక్ వచ్చింది. అయితే, ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా సింధింయా రాజీనామా చేశారు.  
2019 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కు అడుగు దూరంలో నిలిచిన బీజేపీ....కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ కమల్ కు తెరతీసింది. కర్ణాటక తరహాలో మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ నుంచి అధికారం లాక్కునేందుకు పావులు కదిపింది. అసంతృప్త నేత సింధియాను బీజేపీ బ్రెయిన్ వాష్ చేసింది. తాజాగా మోడీ, షాలతో భేటీ అయిన సింధియా.....20 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. 
తన రాజీనామా లేఖను సింధియా ట్వీట్ చేశారు. తన రాజీనామాకు గల కారణాలను అందులో వివరించారు. గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశానని... ఇప్పుడు మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని లేఖలో సింధియా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని... తాను ఈ దిశగా ఏడాది క్రితం నుంచే ఆలోచిస్తున్నాననే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం తనకు ముందు నుంచి ఉందని... అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తన లక్ష్యాన్ని తాను సాధించలేనని చెప్పారు.