జగన్ మేనమామకు షాక్

August 05, 2020

కడప జిల్లాలో వైఎస్సార్ సీపీ పార్టీకి ఎంత పట్టు ఉందో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో స్వీప్ చేసింది. వైఎస్ కుటుంబం అక్కడ ఎపుడూ ఓడిపోలేదు. అయితే, అధికారం ఉందని, ఏం చేసినా తామే గెలుస్తాం అనుకుంటే జనం ఊరుకునే రోజులు కావు ఇవి. సోషల్ మీడియా ప్రవేశంతో ప్రపంచం మారిపోయింది. అందులో కడప మారదా?

తాజాగా ప్రజల కోసమే ప్రభుత్వం అని పైకి చెబుతూ రైతుల భూములను అయిష్టంగా లాక్కునే ప్రయత్నం బెడిసికొట్టింది. సోలార్ పార్క్ పేరిట పచ్చటి పొలాలను నాశనం చేయాలన్న ఆలోచనను రైతులు ఆదిలోనే అడ్డుకుంటున్నారు.

​కమలాపురం నియోజకవర్గం వెల్లటూరులో ఓ ఘటన జరిగింది. ఎమ్మెల్యే పర్యటనను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోలార్ పార్క్ ఏర్పాటు కోసం స్థలం పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. 

మాకు సోలార్ పార్క్ వద్దంటూ మూడు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు నిరసన తెలిపారు. నేతల వాహనాలు రాకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి ఎవరో కాదు సీఎం జగన్ మేనమామ. 

జగన్ మేనమామకు  సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురవడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. ఎండ్లమర్రి మండలం, రెడ్డిపల్లె, వెల్లటూరు, సహవాసగానెపల్లె, కొత్తగిరిపల్లె తదితర ప్రాంతాల్లో సాగు భూములు ఎక్కువ ఉన్నందున సోలార్ ప్లాంట్ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.

​ప్రజల ఓట్లతో గెలిచి వారి ఆలోచనలకు వ్యతిరేకంగా  పనులు చేస్తే ​ఇలాంటి వ్యతిరేకత తప్పదు. మొండిగా ముందుకు పోతే జనం ఓటుతో చితక్కొడతారు.