మంగళగిరి నిరసనకు అనూహ్య స్పందన

February 24, 2020

రాజధాని తరలింపుపై రోజురోజుకు వ్యతిరేక గళాలు పెరుగుతున్నాయి. తొలుత అమరావతికి భూములిచ్చిన రైతులతో మొదలైన ఈ ఉద్యమం ఇపుడు అందరికీ విస్తరిస్తోంది. రాష్ట్రంలోని ప్రజలంతా అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. రైతులకు మద్దతు పలుకుతున్నారు. ఈరోజు అన్ని వర్గాల వారు ఆందోళనలకు దిగారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అనేక రూపాల్లో ప్రజలు నిరసన తెలుపుతున్నారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మంగళవారం రాత్రి మంగళగిరిలో పెద్ద ఎత్తున కాగడాల ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో నారా లోకేష్ కూడా చేతులు కలిపారు. కాగడా పట్టుకుని కదిలారు. ’’అమరావతిలోనే రాజధాని ఉంటుంది. అద్భుతమైన నగరం నిర్మిస్తామని చెప్పి ప్రజలను వైఎస్ జగన్ మోసం చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతిలోనే కొనసాగించాలి అంటూ రైతులు, రైతు కూలీలకు మద్దతుగా మంగళగిరి నియోజకవర్గంలో కాగడాల ర్యాలీ నిర్వహించాం'' అంటూ ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేశారు లోకేష్. 

ఎన్నికల ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి జగన్ ప్రజలను మోసం చేశారన్న నారా లోకేష్...జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినదించారు. అమరావతి ముద్దు... మూడు రాజధానులు వద్దూ అంటూ ప్రజలంతా నినాదాలు చేశారు.