ఆమెకు ఇన్విటేషనే గొప్ప. కానీ అబ్సెంట్

April 04, 2020

మోదీ ప్రమాణ స్వీకారానికి దేశ వ్యాప్తంగా ఎందరో నాయకులతో పాటు వివిధ రంగాల ప్రముఖులకూ ఆహ్వానాలు అందాయి. అందులో తెలుగులో పాపులర్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ కూడా ఉండడం విశేషం. అయితే.. మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వస్తున్న నేతల తాకిడితో దిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకల షెడ్యూలన్నీ మారిపోయి కాజల్ దిల్లీ సకాలంలో చేరుకునే అవకాశం లేకపోయింది. ఈ సంగతిని కాజల్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు.
"ప్రియమైన మోదీ గారూ, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కానీ, మీ ప్రమాణస్వీకారం సమయానికి నేను చేరుకోలేకపోవచ్చు. అందుకే హాజరు కావడంలేదు. క్షమించండి. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడలేనందుకు ఎంతో బాధగా ఉంది. అయితే మీరు చరిత్ర సృష్టించే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
మోదీ ప్రమాణానికి హాజరైన వారిలో బిమ్ స్టెక్ దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు, రజనీకాంత్, కంగనా రనౌత్, కరణ్ జోహార్ వంటి సినీ తారలు, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ దంపతులు ఉన్నారు. వారితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం పళనిస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.