జగన్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న ఒకే ఒక్క మాజీ మంత్రి

August 12, 2020

టీడీపీ 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన తరువాత ఆ పార్టీ నేతలు పూర్తిగా నీరుగారిపోయారు. కొందరు పార్టీలు మారితే.. మరికొందు తమలో తాము కొట్టుకుంటూ పరువు తీసుకుంటున్నారు. ట్విటర్ వేదికగానూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. మరికొందరు సైలెంటుగా ఉంటూ క్రియారహితంగా మారిపోయారు. కానీ... ఒక్క నాయకుడు మాత్రం తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ప్రస్తుత జగన్ ప్రభుత్వం మార్చేస్తుంటే ఆందోళనలకు దిగుతున్నారు. 
ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు ఈ విషయమై ఆందోళనకు దిగాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు.  
వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు కాలవ శ్రీనివాసులతో పాటు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిని స్టేషన్ కు తరలిస్తుండగా మిగిలిన టీడీపీ కార్యకర్తలు పోలీసు జీపులను అడ్డుకున్నారు. దీంతో పోలీస్ అధికారులు వీరిపై  లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. అనంతరం కాలవ శ్రీనివాసులు, టీడీపీ కార్యకర్తలను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా వైసీపీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతున్న కాల్వను సొంత పార్టీకే చెందిన కొందరు వెనక్కు లాగుతున్నారని టాక్. అనవసరంగా హడావుడి చేస్తే ఇబ్బందులు పడతామని.. కొన్నాళ్లు సైలెంటుగా ఉండడం బెటరని సూచిస్తున్నారట. కానీ, కాల్వ మాత్రం తనకేమీ వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవని, తనకెందుకు భయమని అంటూ టీడీపీ తరుఫున ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారని టాక్.