పోలీసులపై కంప్లయింట్ ఇచ్చిన హీరో

August 11, 2020

`ఇండియన్-2` చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన క్రేన్ ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన తమిళనాట పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. అంత భారీ క్రేన్ కు అనుమతులు లేకుండానే షూటింగ్ నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వివరణ కోరుతూ హీరో కమలహాసన్, దర్శకుడు శంకర్ కు సీబీసీఐడీ పోలీసులు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కమల్, శంకర్ లు పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్వయంలో ఆ కేసు వ్యవహారంలో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కమల్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తాను మూడు సార్లు విచారణకు హాజరయ్యానని, అయినప్పటికీ పోలీసులు మరోసారి విచారణకు రావాలని అంటున్నారని కమల్ పిటిషన్ లో పేర్కొన్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ మద్రాస్ హైకోర్టులో కమల్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. 

అయితే, తమిళనాడు ప్రభుత్వంపై కమల్ గతంలో చేసిన విమర్శల కారణంగానే కమల్ ను పోలీసులు వేధిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ కోణంలోనే కమల్ ను అన్ని సార్లు విచారణ జరుపుతున్నారని...కమల్ అభిమానులు, మక్కల్ నీది మయ్యం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా, ‘ఇండియన్‌-2’ సెట్లో  క్రేన్‌ ప్రమాదం వార్త కోలీవుడ్ ను కుదిపేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని షూటింగ్‌ స్పాట్‌లో ఫోకస్‌ లైట్లున్న భారీ క్రేన్‌ తెగి కింద పడటంతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ, ఆర్ట్‌ అసిస్టెంట్‌ చంద్రన్‌, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మధు దుర్మరణం చెందగా...మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో చిత్ర టీం షాక్ కు గురైంది. నిబంధనలకు వ్యతిరేకంగా పరిమితికి మించిన భారీ క్రేన్ ను ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ చేపట్టిన సీబీసీఐడీ...చిత్ర దర్శకుడు శంకర్ , కమల్‌హాసన్‌ లను  విచారణ జరిపింది.