కుమార పతనంలో ట్విస్ట్ ఏంటంటే...

April 01, 2020

టెస్ట్ మ్యాచ్ వ‌లే కొన‌సాగుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయానికి ఫుల్‌స్టాఫ్ ప‌డింది. ఆ రాష్ట్రంలోని జేడీఎస్ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బలనిరూపణలో కుమారస్వామి ప్రభుత్వం విఫలమైంది. జేడీఎస్ - కాంగ్రెస్‌కు బలనిరూపణలో 99 ఓట్లు రాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. గత వారంరోజులుగా నడిచిన అసంతృప్తుల రాజకీయం ఈ రోజుతో ముగిసింది. ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించిన కుమారస్వామి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.
ఇక్కడ కొన్ని గమనించాల్సిన విషయాలున్నాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఓటమి చెందిన వారికి సానుభూతి ఉంటుంది. కానీ కుమార స్వామికి ఆ సానుభూతి రాలేదు. ఇదే కథలో ట్విస్ట్. ఎందుకంటే స్వల్పంగా సీట్లతో సీఎం అయినపుడే దానికి ఆయుశ్షు లేదని కర్ణాటక ప్రజలు గ్రహించారు. కుమారకు అర్థమయినా కన్నీళ్లు, సానుభూతితో కాలం గడపాలనుకున్నారే గానీ... ఆసక్తికరమైన పాలన అందించిన ప్రజల మద్దతు పొందలేకపోయారు. ఎంతసేపు పదవి ఎపుడు ఊడిపోతుందో అన్న మీమాంసలో దాని గురించి ఆలోచిస్తూ కాలం గడిపేశారు. ఆయన పాలనపై దృష్టిపెట్టి ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి అన్ని లోక్ సభ సీట్లు వచ్చేవి కావు. మరో విషయం ఏంటంటే... ఇలా జరుగుతుందని తెలిసినపుడు సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామాలు చేసి ఉంటే... మళ్లీ ఎన్నికలు వచ్చినా కుమారస్వామి ధైర్యాన్ని ప్రజలు ఆదరించేవారు. ఎన్నికలు జరక్కపోయినా ఆ పార్టీ మరింత బలపడేది. కానీ ఇపుడు ఆ పార్టీపై కన్నడ ప్రజలు విసుగెత్తి పోయారు. బహుశా భవిష్యత్తులో ఇంతకంటే తక్కువ సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఇదిలా ఉండగా... 2018 మే నెలలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరింది. అయితే, అప్ప‌టి నుంచి క‌ల‌హాల కాపురమే సాగింది. ఈనెల‌లో అది తారాస్థాయికి చేరి ముంబయిలోని ఓ స్టార్ హోటల్ వేదికగా అసమ్మతి రాజకీయం నడిచింది. 15 ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. గత మూడువారాలుగా కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరిగింది. అసమ్మతి ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. విధానసభలో బలపరీక్ష జాప్యం చేసినా ఫలితం దక్కలేదు. దీంతో 14 నెలలకే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సీఎం పదవిని కుమారస్వామి రెండో సారి కోల్పోయాడు. 2004లో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి సీఎంగా పనిచేశారు.
ఇదిలాఉండ‌గా, అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. తనపై బీజేపీ చేస్తోన్న ఆరోపణలు సరికావన్న స్పీకర్ ..తన రాజీనామా పత్రాన్ని సభలో చూపించారు. ఉదయం నుంచి రాజీనామా లేఖను జేబులో పెట్టుకున్నానని స్పీకర్ చెప్పారు. స్పీకర్ రాజీనామా పత్రాన్ని సిబ్బందితో ప్రతిపక్ష నేత యడ్యూరప్పకు పంపించారు. సభలో జరిగిన పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోయిందని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు. సభ్యులు కనీస సంప్రదాయ ప్రక్రియ పాటించకుండా ఇబ్బంది పెట్టారు. స్పీకర్ పదవిలో రాజ్యాంగ బద్దంగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. రాజ్యాంగ ప్రమాణాల మేరకే సభను నడిపానన్నారు. మ‌రోవైపు బెంగుళూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. ఇది గురువారం వ‌ర‌కు కొనసాగనుంది. ఎల్లుండి వరకు వైన్ షాప్స్, బార్లు, పబ్బులు మూసివేయనున్నారు.