ఏపీ కొత్త సీఈసీగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ !

June 04, 2020

ఓ వైపు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం....మరోవైపు పాలనలోనూ తన జోరు కొనసాగిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి కొత్త ఆర్డినెన్స్ ను రూపొందించిన ఏపీ సర్కార్....ఆ దిశగా చకచకా పావులు కదుపుతోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి  జస్టిస్ కనగరాజును జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ రోజు ఉదయం విజయవాడలో రిటైర్డ్ జస్టిస్ కనగరాజు బాధ్యతలు స్వీకరించారు.  బాధ్యతలు చేపట్టిన అనతంరం....గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కనగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్ లో జడ్డిగా పనిచేసిన రిటైర్డ్ జస్టిస్ కనగరాజు...పలు కీలకమైన తీర్పులిచ్చారు. తొమ్మిదేళ్ల పాటు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కనగరాజ్...వివిధ కమిషన్లలో సభ్యుడిగా కీలకమైన నివేదికలను ఇచ్చారు. 

సీఎస్, హెల్త్ సెక్రటరీలతో మాట మాత్రం చెప్పకుండా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నియమించిన రమేష్... కరోనా సాకుతో పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, తనకు ప్రాణహాని ఉందంటూ రమేష్...కేంద్ర భద్రతను కోరారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్లు నుంచి మూడేళ్లకు కుదిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాంతోపాటు రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు మాత్రమే ఆ పదవి చేపట్టేలా ఆర్డినెన్స్ రూపొందించింది. తాజా ఆర్డినెన్స్‌తో గత నాలుగేళ్లుగా సీఈసీ బాధ్యతల్లో ఉన్న రమేష్ కుమార్ పదవీ కాలం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజు పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్‌కు పంపిన పైల్‌ను గవర్నర్ ఆమోదించడంతో ఆయన నియామకం ఖరారైంది. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. మరోవైపు, ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా జగన్ భర్తీ చేశారు. ఎయిరిండియా మాజీ సీఎండీ అశ్వినీ లోహానిని జగన్ ఈ పదవిలో నియమించారు.