​హమ్మయ్య... జగన్ కన్నాని సంతోషెట్టాడు

February 19, 2020

ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత జగన్ విషయంలో ఏపీ బీజేపీ నేతల టోన్ చాలా మారింది. అయితే, ముఖ్యంగా నెల రోజుగా మరో కోణం చూపించింది బీజేపీ. జగన్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ బీజేపీతో కయ్యానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. వాళ్లు తిట్టినా, విమర్శించిన, ప్రశంసించినా దేనికీ రిప్లయి ఇవ్వకుండా నెమ్మదిగా తన పని తాను చేసుకుపోతున్నారు. జగనే కాదు, తన టీం కూడా బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.
ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు విపరీతంగా రెచ్చిపోయి జగన్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. నీ గెలుపే మా బిక్ష అని ఒకరంటే... ఒళ్లు దగ్గరపెట్టుకుని పాలించి అని ఇంకొకరన్నారు. ఇలా ఎన్ని రకాలుగా జగన్ ని విమర్శించాలో అన్ని రకాలుగా విమర్శించారు. ఈ క్రమంలో కన్నా జగన్ కి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆయన ఎపుడో నెల క్రితం లేఖ రాశారు. ఇటీవల తమ కౌలు చెల్లించాలంటూ రైతులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో జగన్ సర్కారు దిగొచ్చింది. వారి కౌలు కోసం నిధులు విడుదల చేసింది. అమరావతి మార్పుపై ఏపీ మంత్రులు సృష్టించిన గందరగోళం నేపథ్యంలో కౌలుకూడా రాదేమో అని రైతులు చేసిన ధర్నాలకు ఇది ఫలితం.
కానీ దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అక్కౌంట్లో వేసుకున్నారు. రాజధాని ప్రాంతం రైతులు ప్రభుత్వం తమకు కౌలు చెల్లించడం లేదంటూ తనను కలిసి ఆవేదనను వ్యక్తం చేశారని... వారి బాధ చూసి జగన్ కు తాను బహిరంగ లేఖ రాయగా ముఖ్యమంత్రి స్పందించి రూ. 187.40 కోట్లను విడుదల చేస్తూ జీవో జారీ చేశారని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి థాంక్స్ చెబుతున్నానని కన్నా అన్నారు. జగన్ ఇంకోపని చేయాలని కోరారు... రాజధాని మార్పుపై ఏర్పడిన గందరగోళ పరిస్థితులకు బ్రేక్ వేసేలా ొక ప్రకటన చేయాలని కోరారు. ఏదేమైనా కన్నా చాణక్యం మాత్రం బాగుంది. జగన్ పనిని లటుక్కున తన అక్కౌంట్లో వేసుకున్నారు. ఏపీలో ఎవరికి ఏ కష్టమొచ్చినా కన్నాను అడిగితే సరిపోతుందన్నమాట.