జగన్ జాగీరా అంటూ దుమ్ముదులిపిన కన్నా

April 06, 2020

అమరావతి వ్యవహారం రోజురోజుకి పెద్దది అవుతోంది.  అన్ని పార్టీలు రైతులతో గొంతు కలిపాయి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు అన్నీ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాయి. అమరావతిని రాజధానిగా కొసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్ధండరాయునిపాలెంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాసేపు మౌనదీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు

అమరావతి రైతుల త్యాగాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, వారికి ఎన్నో రాయితీలను కల్పించిందని... వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  జగన్ సర్కారు మూడు రాజధానుల పేరుతో ఈ ప్రాంతం మొత్తాన్ని అమ్మేయడానికి కుట్ర పన్నిందని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. 

రాజధాని ఉండగా జీఎన్ రావు కమిటీని వేయడం, అది నివేదిక ఇవ్వకముందే ముఖ్యమంత్రి మూడు రాజధానులను ప్రకటించడం చూస్తుంటే...  ఇది ఒక వ్యూహాత్మక కుట్ర అని తెలుస్తోందన్నారు. ఏ పార్టీ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నారు. విచిత్రం ఏంటంటే.. కేబినెట్ ఆమోదించకముందే విజయసాయిరెడ్డి వైజాగ్ లో పండగ చేద్దాం అంటున్నారంటే... నివేదిక అనేది ఒక బూటకం, కేవలం జగన్ కు నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోతున్నాడని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యంలా లేదని, వైసీపీ జాగీరులా ఉందన్నారు. ఇలాంటి నియంతృత్వాన్ని, అహంకార ధోరణిని బీజేపీ చూస్తూ ఊరుకోదని కన్నా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రజలు నిద్రలేకుండా చేసిన ఈయన ఆరునెలలు కాదు, ఆరేళ్లు ఇచ్చినా మంచి మఖ్యమంత్రి కాలేరని కన్నా అన్నారు. జగన్ వి తప్పుడు నిర్ణయాలు, ప్రజలపై విపరీతమైన భారాన్ని మోపే నిర్ణయాలు అని కన్నా దూషించారు.