కేసీఆర్ కు గట్టిగా ’కారం’ పూశాడు

July 07, 2020

కారం మాట మారింది. ఆయనతో పాటు మమత మాట కూడా మారిపోయింది. మొన్నటి వరకూ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఆయన పిలిస్తే వెళ్లాం.. భోజనం చేద్దామని ఆహ్వానిస్తే వద్దని వచ్చేయాలా? హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత కూర్చుందామని చెప్పారు.. సీఎం మీద నమ్మకం ఉందంటూ మొన్నామధ్య తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ కారం రవీందర్ రెడ్డి.. మమతలతో పాటు మరికొందరు నేతలు చెప్పిన మాటలు తెలిసిందే. తాజాగా వారి వాయిస్ మారిపోయింది. సీఎం కేసీఆర్ మీద నమ్మకం ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొవటంతో పాటు.. వ్యక్తిగతంగా వస్తున్న ఫోన్లకు వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారన్న విషయం కొద్దిరోజులుగా ఎదురవుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నష్టం కలిగేలా టీఎన్జీవోల తీరు ఉందన్న మాట అంతకంతకూ ప్రచారం పెరగటం.. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. దిద్దుబాటు చర్యలకు తెర తీశారు టీఎన్జీవో నాయకులు. ప్రభుత్వానికి గడువు ఇచ్చామని.. ఆలోపు తమ సమస్యల్ని పరిష్కరించకుంటే తామేం చేయాలో నిర్ణయించుకుంటామని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమస్యల్ని పరిష్కరించాలని.. వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని కూడా తేల్చాలంటూ తాజాగా టీఎన్జీవో జేఏసీ ఛైర్మన్ కారం రవీంద్ర రెడ్డి తేల్చి చెప్పారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన హెచ్చరిక స్వరంతో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఈ నెల 24 తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని.. అన్ని అంశాల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. నెలాఖరు లోపు సమస్యల్ని పరిష్కరించకుంటే తప్పకుండా సమ్మెలోకి వెళతామని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా వారు తెర మీదకు తీసుకొచ్చిన సమస్యల చిట్టా భారీగా ఉంది. మరీ..డిమాండ్ల విషయంలో సీఎం కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కారం అండ్ కో తాజా డిమాండ్ల జాబితాను చూస్తే..

 • 2018 జులై ఒకటి నుంచి వేతన సవరణ అమలు తప్పనిసరి 
 • ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరిని వెనక్కి తేవాలి
 • పదవీ విరమణ వయసు 61కు పెంచాలి
 • ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి
 • బకాయి పడిన కరవుభత్యాల్నివెంటనే చెల్లించాలి
 • సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
 • కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
 • కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సాధారణ ఉద్యోగులతో సమానంగా సెలవులు ఇవ్వాలి
 • ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలివ్వాలి
 • గ్రంథాలయ సంస్థ.. మార్కెటింగ్ కమిటీలు.. వర్సిటీ.. ఎయిడెడ్ ఉద్యోుగలకు 010 పద్దుకింద జీతాలు ఇవ్వాలి
 • ఈ ఉద్యోగులందరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
 • ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు తప్పనిసరి
 • భాషా పండితులు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలి
 • రూ.398లతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి
 • సింగరేణి పాఠశాలల సిబ్బందిని ప్రభుత్వ యాజమాన్యంలోకి తీసుకోవాలి
 • వర్సిటీలు, స్థానిక ఎయిడెడ్‌ సంస్థల్లో ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలి
 • ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ఈ పథకానికి నెలవారీ చందాతో దీన్ని అమలు చేయాలి
 • బదిలీలపై నిషేధం ఎత్తివేయాలి
 • ఎన్నికల సందర్భంగా జిల్లాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు బదిలీ చేయాలి
 • 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు రూ.1500 అదనపు పెన్షన్‌ మంజూరు చేయాలి.
 • పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలి.
 • ఆరేళ్లుగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌ విభాగాల్లో బదిలీలు జరుగలేదు. ఏటా తప్పనిసరిగా జూన్‌..జూలైలలో బదిలీలు చేయాలి
 • శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వేనెం.36, 37లలో ఉన్న ఏపీ ఎన్జీవోల ఇళ్ల స్థలాలను భాగ్యనగర్‌ ఎన్జీవోల సంఘానికి కేటాయించాలి
 • కొత్తగా జిల్లా కార్యాలయాల్లో పూర్వ జిల్లాలతో సమానంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలి
 • ప్రతీ శాఖలో ప్రతీ పదిమంది డ్రైవర్‌లకు ఒక సీనియర్‌ డ్రైవర్‌ పోస్టు మంజూరు చేయాలి