వైసీపీ దెబ్బా మజాకా- కరణం బలరాంకి జ్జానోదయం

August 14, 2020

అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది...  పార్టీ మారడం అంటే చావుతో సమానం అన్నది దాని సారాంశం. మరణానికి ముందు గుండె మీద చేయివేసుకుని నా జన్మలో నా ఆశ, శ్వాస ఒకటే పార్టీ అని చెప్పుకోగలిగిన నేతలో ఉండే జీవిత సంతృప్తే వేరు. ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి వచ్చిన కరణం బలరాం 1978లోనే ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఆయన ముప్పైల్లో ఉండగానే ఎమ్మెల్యే అయ్యారు.

అప్పట్లో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్. అదింకా స్వతంత్ర భారత పార్టీ ముద్రతోనే ఉండేది. కాబట్టి అందులోనే ఉన్నారు. దాని లెక్క వేరు. తర్వాత ప్రాంతీయ పార్టీల తరం మొదలైంది. ఎపుడైతే ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారో పెద్ద ఎత్తున యువకులకు అవకాశం కల్పించారు. అపుడు తెలుగుదేశంలో చేరిన కరణం బలరాం... సుమారు 37 సంవత్సరాలు అదే పార్టీలో ఉన్నారు. కరణం బలరాం వయసు ఇపుడు 73.

కరణం బలరాం 2019 లో తెలుగుదేశం తరఫున చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. చీరాల నుంచి అంతకుముందే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆమంచిపై కరణం గెలిచారు. అయితే... అల్పమైన చిన్న అధికార హోదా కోసం ఇంతకాలం సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు మంట కలిపేసుకుని ఈ వయసులో వైసీపీలో చేరారు. టెక్నికల్ గా టీడీపీలో ఉన్నా.... భౌతికంగా, మానసికంగా వైసీపీలో కొనసాగుతున్నారు. కొడుకు భవిష్యత్తు కోసం, వ్యాపారాల కోసం ఆయన జగన్ పంచన చేరారు.

40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో కరణం తనకంటూ సొంత బాట ఏర్పరుచుకోలేకపోయారు. ఏ పార్టీ అండ లేకుండా కొడుకుని గెలిపించేకునే సత్తా సంపాదించుకోలేకపోయారు అంటే ప్రజలకు కరణం బలరాంకు మధ్య ఎంత దూరం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక పార్టీ జెండా మోస్తేనే గెలిచే పరిస్థితి ఉందంటే... తనకంటూ ఒక అనుచర వర్గం ఉంది తప్ప, సొంత ప్రజా వర్గం లేదు.

ఈయనదే కాదు పురంధేశ్వరి సహా దాదాపు చాలామందిది ఇదే పరిస్థితి. ఆమె కూడా కొడుకు కోసం భర్తను, కొడుకును ఆ పార్టీలో చేర్చింది. 10 ఏళ్ల కేంద్ర మంత్రిగా ఆమె సంపాదించుకున్న స్థానిక ప్రజాబలం జీరో. బలరాం రాజకీయ అనుభవం అంత ఉండదు జగన్ వయసు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఎదిగి... ఒంటరై పోరాడి ఇలాంటి వారికి రాజకీయ ఆశ్రయం కల్పించే స్థాయికి ఎదిగారంటే... వీరు సిగ్గు పడాల్సింది పోయి నిర్మొహమాటంగా పౌరుషం లేకుండా తమ కంటే ఎంతో చిన్నవాడైన జగన్ పంచన చేరుతున్నారు. 

ఇంత అనుభవం ఉండి కూడా అల్పంగా వైసీపీలో చేరి అధికార హోదా పొందడాన్ని వారు గర్వంగా ఫీలవుతుండొచ్చు. కానీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించింది ఇంతేనా? చివరకు తన వయసులో సగం ఉన్న ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఒకే పార్టీలో ఉంటూ గ్రామ స్థాయి గొడవల్లో మునిగి తేలుతున్నారు కరణం.

తాజాగా ఆమంచి వర్గం కాలనీలో కరణం యూత్ కి చెందిన ఒక కుటుంబం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేస్తే... ఇక్కడ ఏం చేసినా మేమే చేయాలి అని వారిని కొట్టి పంపించారు. ఇపుడు ఈ గొడవ పంచాయతీ చేసి .. ఎవరో ఒకరు పైచేయి సాధించి మీసం మెలేస్తారు.

ఇది ఒక రాజకీయం... ఇదీ ఒక జీవితం. కర్మ !! మరేం సాధించారు ఇంతకాలం. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కొడుక్కే అవకాశం. 5 ఏళ్లు కళ్లు మూసుకుని ఉండుంటే ఒకటే పార్టీలో ఉన్న సంతృప్తితో జీవిత చరమాంకం హాయిగా గడిపేవారు. కానీ కరణం బలరాం ఏ స్థాయిలో ఉన్నారిపుడు? తన వర్గం అన్నదానం చేయాలన్నా తానుంటున్న పార్టీలోనే ఒక వర్గం అనుమతి తీసుకునే బలహీన రాజకీయ దుస్థితిని అనుభవిస్తుండటం విచారకరం, శోచనీయం. 

ఇపుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిన యువత నేర్చుకోవాల్సింది ఒకటే... మీ నియోజకవర్గంలో మీకు పడే ఓటు మీ సొంతం కావాలి, మీరు పార్టీ అవసరం లేకుండా గెలవాలి... అపుడు మీరు ప్రజలకు మేలు చేసినట్లు. అపుడు ప్రజలు మీ వెంట ఉన్నట్లు. అపుడే మీ జీవితంలో గెలిచినట్టు. లేకపోతే ఇలాగే ముదుసలి వయసులో ఎవరో పంచనో పడి బతకాల్సి వస్తుంది.