బాబు పదవిచ్చి ఆదరిస్తే... ఈ నేత చేసిందేమిటి?

August 07, 2020

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... ఈయనకు కీలకమైన పదవి ఇచ్చి ఓ రేంజి నేతను చేశారు. బాబు అధికారంలో ఉన్నంత కాలం టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి... బాబు ప్రతిపక్ష నేతగా మారిన తర్వాత బాబుకు దూరంగా జరిగిన ఈ నేత ఇప్పుడు ఏకంగా ప్లేట్ ఫిరాయించేశారు. అంతేనా... బాబు ఇచ్చిన పదవిని తనదైన మార్కు వ్యూహంతో ఇంతకాలం కాపాడుకున్న ఈయన ఇప్పుడు ఉన్నపళంగా టీడీపీకి హ్యాండిచ్చేసి వైసీపీలో చేరిపోయారు. ఈ నేతే మొన్నటిదాకా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కొనసాగి మొన్న సదరు పదవికి రాజీనామా చేసిన కారెం శివాజీ. అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయో కారెం చూపించేశారు. 

కారెం శివాజీ వ్యవహారంపై ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి రాకముందు కారెం శివాజీ ఓ చోటా మోటా నేత కూడా కాదు. మాల మహానాడులో ఓ మోస్తరు నాయకుడిగా ఉన్న కారెం... ఏపీకి ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం బాబు సర్కారు సాగిస్తున్న ఉద్యమానికి ఆకర్షితుడై టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన కారెంకు చంద్రబాబు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కూడా ఇచ్చారు. ఈ పదవితో కారెంకు నిజంగానే ఓ హోదా వచ్చేసింది. ఓ రేంజి కలిగిన నేతగా ఎదిగే అవకాశం కూడా దక్కింది. 

అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటమి దక్కడం, చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోవడం జరిగిపోయింది. అంతే చంద్రబాబుతో పాటు టీడీపీకి దూరం జరిగేసిన కారెం... బాబు ఇచ్చిన పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. తన పదవిని కాపాడుకునే క్రమంలో వైసీపీ నేతలకు దగ్గరగా జరిగిన కారెం... వైసీపీలో చేరేందుకు తనదైన శైలి యత్నాలు చేశారు. ఈ యత్నాలు చాలా కాలం పాటు ఫలించలేదు. అయినా కూడా వైసీపీ నేతలతో టచ్ లో కొనసాగుతూనే... కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగారు. అయితే ఎప్పుడైతే... వైసీపీలోకి ఎంట్రీకి జగన్ నుంచి అనుమతి రాగానే... మొన్న తన పదవికి రాజీనామా చేసిన కారెం... శుక్రవారం జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో కారెం వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటే... రాజకీయాల్లో ఈ తరహా నేతలు కూడా ఉంటారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.