సుమ‌ల‌తకు సారీ చెప్పిన సీఎం!

August 03, 2020

కొన్ని సంద‌ర్భాల్లో కొన్ని వివాదాలు ఏ మాత్రం మంచివికావు. ఆ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ ఆవేశంలోనో.. భావోద్వేగంలోనే మాట జారుతూ కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టుకోవ‌టం కొంద‌రికి అల‌వాటే. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క సీఎం పీఠంపై క‌మ‌ల‌నాథులు క‌న్నేయ‌టం.. అవ‌కాశం కోసం కాచుకొని కూర్చోవ‌టం తెలిసిందే. ఇలాంటి వేళ‌.. మిత్ర‌ప‌క్షం నేత‌లు.. అందునా ఒక మ‌హిళ‌ను ఉద్దేశించి జేడీఎస్ ముఖ్య‌నేత.. సీఎం కుమార‌స్వామి సోద‌రుడు రేవ‌ణ్న చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే.

త‌న భ‌ర్త ప్రాతినిధ్యం వ‌హించిన మాండ్య బ‌రిలో దిగాల‌ని ప్ర‌ముఖ సినీన‌టి.. దివంగ‌త నేత అంబ‌రీష్ స‌తీమ‌ణి సుమ‌ల‌త సిద్ధం కావ‌టం తెలిసిందే. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రేవ‌ణ్ణ నోరు జారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు భ‌ర్త మృతి చెంది రెండు నెల‌లు కూడా కాలేదు.. అప్పుడే ఆమెకురాజ‌కీయాలు అవ‌స‌ర‌మా? అంటూ అన‌కూడ‌ని మాట‌ను అనేశారు. ఈ మాట‌లు పెనుదుమారంగా మార‌ట‌మే కాదు.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తేలా చేశాయి.

కీల‌క‌మైన‌ ఎన్నిక‌ల వేళ‌లో ఇలాంటి వ్యాఖ్య‌ల కార‌ణంగా జ‌రిగే డ్యామేజ్ ను గుర్తించిన క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి.. త‌న సోద‌రుడు చేసిన వ్యాఖ్య‌ల‌కు భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. మీడియా మిత్రులు ఉద్రేక పూర్వ‌కంగా ప్ర‌శ్న‌లు వేయ‌టంతో నోరు జారిన‌ట్లుగా చెప్పారు. 

త‌న సోద‌రుడుచేసిన వ్యాఖ్య‌ల‌కు తాను సారీ చెబుతున్న‌ట్లు చెప్పిన కుమార‌స్వామి.. త‌మ కుటుంబం మ‌హిళ‌ల‌ను అవ‌మానించ‌ద‌న్నారు. హెచ్చ‌రిక స్వ‌రంతో మాట్లాడాల్సి రావ‌టం మంచిది కాద‌ని.. త‌న సోద‌రుడు త‌ర‌ఫున తాను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. మాండ్య‌నుంచి బ‌రిలోకి దిగ‌నున్న జేడీఎస్ అభ్య‌ర్థి నిఖిల్ కూడా రేవ‌ణ్న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సారీ చెప్పారు. ఏ సంద‌ర్భంలో అలా మాట్లాడారో ఆన‌కు తెలీద‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి సోద‌రుడు నోరు జారిన వేళ‌.. త‌న స్థాయిని.. హోదాను వ‌దిలేసి సోద‌రుడు చేసిన త‌ప్పున‌కు సారీ చెప్ప‌టం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.