కర్నాటకం - ఖేల్ ఖతం, దుకాణ్ బంద్

July 05, 2020

ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లిన కుమారస్వామి అదే హోదాలో తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలే హార్ట్ పేషెంట్ అయిన కుమారస్వామి తన ప్రభుత్వం ఎపుడు కూలిపోతుందో తెలియక తీవ్రమైన ఆందోళనలో, భయంలో ఉన్నాడు. ఎవరు దేని గురించి ఆలోచిస్తే అదే సిద్ధిస్తుందంటారు. ఇక్కడ అదే జరిగినట్టుంది. 

కర్ణాటకలో 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఉదయం నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య యడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. స్పీకర్ వారి రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వం తక్షణం కూలిపోతుంది. ఒకవేళ స్పీకర్ వారి రాజీనామాలు ా ఆమోదించకపోయినా గవర్నర్ తో బీజేపీ పావులు కదిపే అవకాశం ఉంది. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. 14 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే స్పీకర్ వారి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అదే రాజీనామా చేస్తే... వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. అయినా కూడా ఒక నెల అటు ఇటుగా ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమే. ఎందుకంటే... గవర్నర్ కుమారస్వామిని బలనిరూపణకు పిలిస్తే... బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేక ఓటు వేస్తారు. ఇప్పటికే ఇండిపెండెంట్లు బీజేపీ లైన్లో ఉన్నారు. ఇపుడు పద్నాలుగు మంది రాజీనామా చేయడంతో కుమారస్వామికి సరిపడా మెజారిటీ దక్కదు. కాబట్టి ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే ఫిరాయింపుల కంటే... రాజీనామా చేయించి ప్రభుత్వం నెలకొల్పడం, లేదా మళ్లీ ఎన్నికలకు పోవడమే బెటర్ అని బీజేపీ భావిస్తోంది. 

మొన్ననే కర్ణాటకలో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ... ప్రజల్లో కాంగ్ - జేడీఎస్ కూటమికి మద్దతు లేదని భావించి ఈ క్రైసిస్ ను సృష్టించింది. ఒకవేళ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది బీజేపీ ఆలోచన. ఇపుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా గోవాకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మరి రసకందాయంలో పడిన కర్ణాటక రాజకీయం ఏం జరుగుతుందో  చూడాలి.