ఇది రేర్ పొలిటికల్ సీన్

July 09, 2020

మొన్నటిదాకా రంజుగా సాగిన కర్ణాటక రాజకీయం ఇప్పుడు మరింత రంజుగా మారిందని చెప్పక తప్పదు. గతేడాది జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ రాని నేపథ్యంలో రోజుకో ట్విస్టు చొప్పున అక్కడ రాజకీయం రక్తి కట్టింది. బీజేపీని అధికారానికి దూరం పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగిన కాంగ్రెస్... జేడీఎస్ తో జట్టుకట్టి కుమారస్వామికి సీఎం పీఠాన్ని అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే కుమార సర్కారును రూలదోసే క్రమంలో గడచిన పది రోజులుగా చోటుచేసుకున్న ఆసక్తికర ట్విస్టుల నేపథ్యంలో కుమార సర్కారు కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ నేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప సీఎం అవుతారనుకుంటే.. అది కూడా ఆసక్తికర మలుపులు తిరుగుతోంది.

కుమార సర్కారును కూలదోసే క్రమంలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 15 మంది, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు... మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.... వారి రాజీనామాలు ఆమోదించే విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తనదైన శైలిలో వ్యవహరించి కుమార బలపరీక్షను నాలుగు రోజుల పాటు వాయిదా వేయగలిగారు. అయితే ఎట్టకేలకు బలపరీక్షను పూర్తి చేసిన రమేశ్... గురువారం సాయంత్రం తనదైన మార్కు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేస్తే... రమేశ్ మాత్రం వారిలో ముగ్గురి రాజీనామాలకు ఆమోద ముద్ర వేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలు కూడా ఒకే దఫాలో జరగని విషయం తెలిసిందే కదా. ముగ్గురు ఓ సారి, మరో ఇద్దరు మరోసారి, ఆ తర్వాత ఇంకో నలుగురు... ఇలా వరుస కట్టి ఒకే రోజు కాకుండా 17 మంది ఎమ్మెల్యేలు విడతలవారీగా రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలను ఆమోదించి తీరాలని బీజేపీ శిబిరం ఏకంగా ఓ రాత్రంతా అసెంబ్లీలోనే పడుకుండిపోయింది.

అయినా కరగని స్పీకర్... ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుండానే విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో కుమార స్వామి ఓటమిపాలై, తన సీఎం పదవికి రాజీనామా చేశాక కూడా ఎమ్మెల్యేల రాజీనామాలపై రమేశ్ చర్యలు చేపట్టలేదు. అయితే ఏమైందో తెలియదు గానీ... గురువారం సాయంత్రం ఉన్నట్లుండి ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్ ఆమోద ముద్ర వేశారు. స్పీకర్ ఆమోదించిన రాజీనామాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి కుమార కేబినెట్ లో మంత్రి పదవి కూడా చేపట్టిన శంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన మహేశ్, రమేశ్ లవి ఉన్నాయి. మరి మిగిలిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఎప్పుడు ఆమోదిస్తారో చూడాలి. చూస్తుంటే... రాజీనామాల ఆమోదం కూడా విడతలవారీగానే కొనసాగేలా ఉందని చెప్పక తప్పదు.