చిన్మయి మరో సంచలనం.. ఆ ఇద్దరు సింగర్స్ మంచి మగాళ్లు కాదు

April 02, 2020

న్యాయం కోసం పోరాడటం అంత తేలికైన విషయం కాదు. పోరాడే క్రమంలో ఒత్తిళ్లు.. ఎమోషనల్ బ్లాక్ మొయిలింగ్.. రాజీ పేరుతో పెద్దలు చేసే రాయబారాలు.. ఇలా చెప్పుకుంటే కనిపించే వాటికి మించి ఎవరికి కనిపించనివెన్నో జరుగుతాయి. మామూలు వ్యక్తుల పరిస్థితులే ఇలా ఉంటే.. సెలబ్రిటీల విషయంలో ఉండే అంశాలెన్నో మీటూ ఉద్యమ నేపథ్యంలో లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి చేస్తున్న పోరాటం అంతా ఇంతా కాదు.
తనకున్న స్టార్ స్టేటస్ ఏమవుతుందన్నది పక్కన పెట్టి.. నిజం కోసం.. న్యాయం కోసం ఆమె భారీ పోరాటమే చేస్తున్నారు. పెద్ద తలకాయల్ని సైతం ఢీ కొంటున్నారు. ఈ క్రమంలో తన వద్దకు వచ్చే రాజీ అంశాల్ని సైతం ఓపెన్ చేసేస్తూ షాకిస్తున్నారు. తమిళ సినీ రంగ ప్రముఖుడు వైరముత్తు మీద సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి.. స్టార్ సింగర్ కార్తీక్ మీదా లైంగిక ఆరోపణలు చేయటం తెలిసిందే.
తన మీద కత్తి కట్టి.. అవకాశాలు రాకుండా చేసినా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తీసేసినా.. వెనక్కి తగ్గని ఈ ఫైర్ బ్రాండ్ తాజాగా చేసిన ట్వీట్ ఒకటి సంచలనంగా మారింది. సింగర్ కార్తీక్ మీద తాను చేసిన  ఆరోపణలు ఒక కొలిక్కి రానప్పటికి.. అతగాడికి డబ్బింగ్ యూనియన్ లో చోటు దక్కటం విశేషం. డబ్బింగ్ యూనియన్ ఎన్నికల బరిలో దిగాలనుకున్న చిన్మయికి అవకాశం లేకుండా చేసిన నేపథ్యంలో.. సింగర్ మనో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
దీనికి కౌంటర్ ఇస్తూ చిన్మయి సంచలనంగా మారారు. స్టార్ గాయకుడు కార్తీక్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత మనో నాకు ఫోన్ చేశారు. ఇంటికి రావాలని పిలిచారంటూ.. ‘‘నువ్వు చేసిన ఆరోపణలతో కార్తీక్ భార్య బాధ పడుతోంది. ఏడుస్తోంది. అతడి కెరీర్ నాశనం చేయకు. నువ్వు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నావు. కార్తీక్ అంతే. ప్రస్తుతం అతడు మంచి స్థానంలో ఉన్నాడు. దాన్ని పాడు చేయకు అంటూ మనో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు’’ అంటూ ఓపెన్ అయ్యింది.
మనో రాజీపై బదులిచ్చిన చిన్మయి.. ప్రొఫెషన్ పరంగా కార్తీక్ మీద తనకు గౌరవం ఉందని.. ఎంతో కష్టపడి అతడు పైకి వచ్చాడని పేర్కొంది. తాను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొని గుర్తింపు సొంతం చేసుకున్నానని.. కానీ పైకి వచ్చిన తర్వాత మాత్రం కార్తీక్ మాదిరి చెడుగా ఎవరూ ప్రవర్తించలేదన్నారు. అంతలా వేధింపులు కూడా ఎవరూ చేయలేదన్న ఆమె.. మరో ఘాటు వ్యాఖ్య చేశారు. మనో.. కార్తీలు మంచి సింగర్స్ కావొచ్చు. కానీ.. వారిద్దరూ మంచి మగాళ్లు మాత్రం కాదని తనదైన శైలిలో పంచ్ ట్వీట్ చేశారు చిన్మయి. తాను చేస్తున్న పోరాటంలో ఇంత ఓపెన్ గా ఉండటం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందేమో?