దేశానికి అమోఘమైన రోజు ... కాశ్మీర్ హమారా హై

November 09, 2019

ఈ దేశం పులకించింది. 60 ఏళ్ల క్రితం చేసిన కుట్రను సమాధి చేసింది. భారతదేశంలోని భూభాగంపై భారతీయుల హక్కులను కాలరాస్తున్న ఆర్టికల్ 370 డి ని భారతపార్లమెంటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోగా... భారత రాష్ట్రపతి దానిని ఆమోదించారు. అమిత్ షా ఇలా బిల్లు పెట్టారో లేదో.. రాష్ట్రపతి నుంచి అలా గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది.

జమ్మూ కశ్మీర్ విభజన కూడా
జమ్ముకశ్మీర్ విభజనకు కూడా ఇదే సమయంలో అమిత్ షా బిల్లు ప్రవేశపెట్టారు. ఇక నుంచి అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్, చట్టసభలున్న కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్ము, కశ్మీర్‌లను విభజితం అయ్యాయి. అంటే... జమ్ముకశ్మీర్‌ మూడు ముక్కలు అయ్యింది. ‘జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్ ప్రాంతం ప్రజలు ఎంతో కాలంగా కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇవ్వాలని కోరుతున్నారు. వారి ప్రయోజనాలు నెరవేర్చేందుకు చట్టసభ లేని లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది. అంతర్గత భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలో సీమాంతర ఉగ్రవాదం నేపథ్యంలోను జమ్మూ మరియు కశ్మీర్‌కు చట్టసభ కలిగిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటవుతుంది.’ అని అమిత్ షా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.