నాని సింగిల్ పంచ్... పుకార్లన్నీ బంద్

August 10, 2020

టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) పాలిటిక్స్ లోకి వచ్చాక అందరి మాదిరి అవకాశవాద రాజకీయాలకు పాల్పడలేదనే చెప్పాలి. ఓ వైపు ఎంపీ ల్యాడ్స్ తో తనను గెలిపించిన విజయవాడ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూనే... మరోవైపు టాటా ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలను రప్పించి తన నియోజకవర్గంలోని చాలా గ్రామాలను దత్తత తీసుకునేలా చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలోనే తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులంతా ఓటమిపాలైతే... నాని మాత్రం గెలిచారు. పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఎక్కువ మెజారీటీ దక్కింది నానికే.

విజయవాడలో వైసీపీ గాలి వీచినా... నాని నిలిచి గెలిచారంటే... అందుకు నాని చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలే అని చెప్పాలి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన ఇమేజీనే డ్యామేజీ చేస్తుందని భావించిన తన తాతల కాలం నాటి ట్రావెల్స్ బిజినెస్ ను కూడా వదిలేసిన నేత నాని. అలాంటి నాని ఏవో రెండు కారణాలను చూపి పార్టీ మారుతున్నారంటూ ఇప్పుడు అన్ని రకాల మీడియాలు వార్తలు రాసేస్తున్నాయి. ఈ క్రమంలో వారందరి నోళ్లు మూయించేందుకు ఎంట్రీ ఇచ్చిన నాని... ఒక్కటంటే ఒక్క డైలాగ్... అది కూడా అదిరిపోయే డైలాగ్ ను సంధించారు.

నాని సంధించిన ఈ అదిరేటి పంచ్ డైలాగ్ తో నిజంగానే నాని పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన పుకార్లన్నీ దెబ్బకు తేలిపోయాయి. అయినా నాని సంధించిన ఆ అదిరేటి డైలాగ్ ఏమిటంటే... ఒకవేళ చంద్రబాబు వైసీపీలో చేరితే... నాని బీజేపీలో చేరిపోయినట్టేనట. నిజమే మరి... ఎక్కడ తన బిజినెస్ కారణంగా తనకు తన పార్టీకి ఇబ్బంది వస్తుందోనని తాతల కాలం నాటి బిజినెస్ నే రద్దు చేసుకున్న నాని టీడీపీని వీడతారంటే నమ్మేదెలా? అందుకే... టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీలో చేరిపోతే... తాను బీజేపీలో చేరినట్టేనని ఆయన మీడియాలో వచ్చిన పుకార్లకు అదిరేటి పంచ్ సంధించారు.