బాలయ్య ఎంట్రీతో శుభం కార్డు !

August 05, 2020

బాలయ్య అలియాస్ నందమూరి బాలకృష్ణ... చాలా అనవసరం విషయాలను పట్టించుకోరు. తన జోలికి వస్తే వదిలిపెట్టరు. కావలిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం వివాదాస్పదం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఇటు కేసీఆర్ గాని, అటు బాబు గాని... ఆరేళ్లలో ఎన్నడూ వైఎస్ విగ్రహాన్ని తొలగించింది లేదు.

అలాంటిది... అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం తీవ్రవివాదస్పదం అయ్యింది. ఈ గొడవ సందర్భంగా ఓ 78 ఏళ్ల వృద్ధురాలు అధికార పార్టీ నేతలపై ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పిరికి వాళ్లు, నేను లేనపుడు తొలగిస్తారా?  అంటూ చెడుగుడు ఆడింది. ఆ వీడియతో ఇష్యూ మరింత పాపులర్ అయ్యింది.

చంద్రబాబు, లోకేష్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. విగ్రహం మళ్లీ తేవాలి అంతవరకు వదిలే ప్రసక్తే లేదు అని పార్టీ స్థానిక నేతలతో మాట్లాడారు. ఇంతలో ఈ ఇష్యూలోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. ముప్పేట దాడితో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇరుకున పడ్డారు. వైసీపీకి వాస్తవ పరిస్థితి అర్థమైంది.

ఎన్టీఆర్ క్రేజు ఇప్పటికీ ఇసుమంతైనా తగ్గలేదు... ఆయన విగ్రహాల జోలికి పోతే సీన్ ఎలా ఉంటుందో అర్థమైంది. ఈక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి స్వయంగా నందమూరి బాలకృష్ణకు ఫోన్ చేసి... విషయాన్ని వివరించారు. విగ్రహ పునరుద్ధరణకు హామీ ఇవ్వడంతో బాలకృష్ణ శాంతించారు.

విగ్రహంపై తొలగించాలని ఎవరికీ చెప్పలేదని... స్థానికులు ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే తొలగించారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. జరిగిన దానిని మరిచిపోండి.... సమీపంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా బాలయ్యకు ప్రతాప్ రెడ్డి ఇచ్చారు.  నేను కూడా ఎన్టీఆర్ వీరాభిమానిని అని, విగ్రహం పెట్టే బాధ్యత నాదే అని రామిరెడ్డి వివరించారు. దీంతో వ్యవహారం సద్దుమణిగింది.