శకునం బాగా లేదు కవితక్కా!

May 28, 2020

ఒక ఘటనకు.. మరో సంఘటనకు సంబంధం పెద్దగా ఉండదు. కానీ.. నమ్మకాలు ఎక్కువగా ఉన్న వారు మాత్రం జరిగే ప్రతి ఘటనకు ఏదో ఒక అర్థాన్ని.. పరామర్థాన్ని వెతుకుతుంటారు. ఇలాంటి తీరు కొందరిలో ఎక్కువగా కనిపిస్తే.. మరికొందరిలో మచ్చుకు కనిపించవు. ఎవరిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూడండి.. ఆయనకు ఎన్ని సెంటిమెంట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. దేవుడ్ని విపరీతంగా నమ్మే ఆయన.. తరచూ పూజలు.. యాగాలు అంటూ హడావుడి చేస్తుంటారు.
ఆయన రాజకీయ వారసుడు.. మంత్రి కేటీఆర్ సంగతే చూస్తే.. ఆయనకు ఇలాంటి సెంటిమెంట్లు ఏమీ ఉండవని చెబుతారు. తండ్రికి పూర్తి భిన్నంగా పూజలు.. యాగాలు లాంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చెబుతారు. నమ్మకాలకు పెద్దగా విలువ ఇవ్వని కేటీఆర్.. అదే సమయంలో తండ్రి నమ్మకాల గురించి ఎప్పుడూ వ్యాఖ్యలు చేయరని చెబుతారు. ఇదంతా ఎందుకంటే.. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆమె వెళుతున్న వాహనాల శ్రేణిలోని ఒక వాహనం మరో వాహనాన్ని ఢీ కొన్న వైనం ఆసక్తికరంగా మారింది.
ప్రతి పని చేసే సమయంలో నమ్మకాల ఆధారంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్.. తాజాగా తన కుమార్తె నామినేషన్ వేసేందుకువెళుతున్న వేళలో.. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ కార్లలో ఒక కారును మరో కారు గుద్దుకొనటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కవిత కాన్వాయ్ లోని వాహనాలు తుప్రాన్ చేరుకున్న వేళ.. ముందుగా వెళుతున్న ఆర్మూరు ఎమ్మెల్యే జీవనర్ రెడ్డి కారును.. కాన్వాయ్ లోని మరో కారు ఢీ కొంది. దీంతో.. ఎమ్మెల్యే కారు ముందు భాగం బాగా దెబ్బ తింది. అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవటంతో భారీ రిలీఫ్ కు గురయ్యారు. తాను క్షేమంగానే ఉన్నానని.. తనకేం కాలేదని జీవన్ రెడ్డి చెప్పటంతో మిగిలిన వారంతా రిలాక్స్ అయ్యారు.
కీలకమైన నామినేషన్ సమయంలో ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవటంపై ప్రత్యేక చర్చ సాగుతోంది. శకునం బాగోలేదన్న మాట కొందరి నోటి నుంచి వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం ఒంటిగంట వేళలో కవిత నిజామాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. పలువురు టీఆర్ఎస్ నేతలు వెంట రాగా.. ఆమె తన నామినేషన్ పత్రాల్ని దాఖలు చేశారు. కవిత నామినేషన్ వేసే సమయంలో పలువురు మంత్రులు ఆమె వెంట ఉండటం గమనార్హం. మరి.. సారుగారి కుమార్తె స్వయంగా నామినేషన్ వేస్తుంటే ఆ మాత్రం మందిమార్బలం లేకుండా ఉంటుందా ఏంటి?