కేసీఆర్... బాలయ్య... కెమిస్ట్రీ !! 

August 12, 2020

నందమూరి బాలకృష్ణ... కేసీఆర్ పై తాజాగా చేసిన కామెంట్ కొందరు తెలుగుదేశం వారిని నొప్పించిందట. బాలయ్యను కనీసం ఆహ్వానించకుండా తెలుగు సినిమాలో కొందరు చిరంజీవి నేతృత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడంతో బాలయ్య చేసిన కామెంట్లు తెలుగు పరిశ్రమలో కొత్త వివాదానికి దారి తీశాయి. త్వరలో బాలయ్య పుట్టిన రోజు కూడా ఉండటంతో తరచుగా అందరూ బాలయ్యను ఇంటర్వ్యూ చేస్తుండటం, ప్రతిదాంట్లోను రాజకీయాలు, సినిమా ప్రస్తావనకు రావడంతో కొంతకాలంగా బాలయ్య టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు.  

తాజా గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ గురించి ప్రశంసించారు. మా నాన్నగారికి కేసీఆర్ ప్రియశిష్యుడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి కూడా నందమూరి తారక రామారావు అంటే చాలా అభిమానం. అందుకే ఆయన కొడుక్కి ఆ పేరే పెట్టుకున్నారు. అప్పట్లోనే ఇష్టంగా కారులో ఎక్కించుకుని మాట్లాడేవారు రామారావు గారు. రాజకీయాల్లో కేసీఆర్ బాగా రాణిస్తాడని చెప్పేవారు. అనుకున్నట్లే ఆయన రాజకీయాల్లో లెజెండ్ గా నిలిచారు అని బాలయ్య వ్యాఖ్యానించారు. జన్మభూమి పథకానికి పేరు సూచించింది కూడా కేసీఆరే అనుకుంటా అని బాలకృష్ణ అన్నారు.

బాలయ్య తాజా కామెంట్స్ తో తెలుగుదేశం అభిమానులు కొంచెం నొచ్చుకుని ఉంటారేమో. ఒకవైపు చంద్రబాబుపై పనికిమాలిన విమర్శలు చేస్తున్న కేసీఆర్ ను లెజెండ్ ఎలా అంటారు బాలయ్య అని కొందరు బాధపడి ఉండొచ్చు. చిరంజీవి గురించి అయినా, కేసీఆర్ గురించి అయినా... బాలయ్య తనకు అనిపించిందే చెబుతారు. ఇది కూడా అంతే. జగన్ కడప (అభిమాన సంఘం) టౌన్‌ ప్రెసిడెంట్‌! అన్నారు బాలయ్య. 

రాజకీయాలు అనేక తేడాలు తెస్తాయన్నారు. ఎన్టీఆర్‌గారు రాజకీయాల్లోకి రాక ముందు అప్పట్లో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ మాత్రమే ఫేమస్.  ఆ పార్టీలో 90 శాతం మంది నాన్నగారి అభిమానులే... రాజకీయాల్లోకి వచ్చాక పరిస్థితులు మారుతాయి కదా.  సినిమాను రాజకీయాలను కలపరు అన్నారు.

అంటే అటు కేసీఆర్ నందమూరి తారక రామారావు అభిమాని అయితే, జగన్ నందమూరి బాలకృష్ణ అభిమాని... అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నందమూరి అభిమానులే అన్నమాట.