బడ్జెట్ పెట్టావా.. బీజేపీని తిట్టావా కేసీఆర్?

August 11, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ విస్తరణ తరువాత మరునాడే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుమతితో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 2019- 2020 కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే... కేసీఆర్ బడ్జెట్ సమర్పణ సందర్భంగా చేసిన ప్రసంగం వింటున్నవారికి అది తెలంగాణ బడ్జెట్టా..? కేంద్ర బడ్జెట్టా అన్న అనుమానం ఏర్పడింది. ఆయన తన ప్రసంగం ప్రారంభించీ ప్రారంభించగానే.. దేశ జీడీపీ గణాంకాలు.. వృద్ధిరేటు పతనం.. విమానయానం, ఆటో మొబైల్ ఇండస్ట్రీల అభివృద్ధి క్షీణించడం.. ఉద్యోగాలు పోతుండడం.. ఆర్థిక మాంద్యం గురించి చెప్పుకొంటూ పోయారు. దీంతో.. వింటున్నవారంతా కేసీఆర్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారా ఏంటి అంటూ సెటైర్లు వేయడం కనిపించింది.
అయితే.. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇలా ఎత్తుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటికి ఇప్పటికి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో మునుపటిలా బడ్జెట్లో ఎడాపెడా కేటాయింపులు చేయడానికి వీల్లేని పరిస్థితి. కానీ.. ఒక్కసారిగా టైట్ చేస్తే జనం నుంచి వ్యతిరేకత.. మేధావి వర్గం నుంచి విమర్శలు.. వ్యతిరేక విశ్లేషణలు వస్తాయి కాబట్టి ఇదంతా తన తప్పేం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇలా వెళ్తున్నామన్నట్లుగా ఆయన కేంద్రంపై నిందలేస్తూ పావుగంట పాటు దేశ ఆర్థిక పరిస్థితిని వివరించుకుంటూపోయారు. ఆ తరువాత తెలంగాణ లెక్కల్లోకి వచ్చారు.. అప్పుడు కూడా కేంద్రం నుంచి ఏమీ రావడం లేదంటూ ప్రతి రంగంలోనూ కేంద్రంపై నిందలేస్తూ వెళ్లారు. మరి.. ఈ బడ్జెట్‌పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

కాగా... గత ఫిబ్రవరిలో సభలో ఆమోదించిన ఓటాన్ అకౌంట్ పొద్దు సెప్టెంబర్ 30న ముగియడంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం తీసుకు వస్తుంది రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచింది అని చెప్పడం.. తమ వైఫల్యాలను కూడా కేంద్రంపై వేసే ప్రయత్నం చేయడం.. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రతిష్ఠాత్మక పథకాలు వేస్టన్నట్లుగా ఆయన విమర్శలు చేయడంతో బీజేపీ నేతలు ఎట్లా తిప్పికొడతారన్నది చూడాలి.