మోడీని ఏకిపారేసిన కేసీఆర్

August 15, 2020

మోడీతో ఫ్రెండ్షిప్ చేస్తే అది మోడీకే లాభం గాని మనకేం లాభం లేదన్న సత్యాన్ని చాలా వేగంగా కేసీఆర్ గ్రహించారు. ఈరోజు మోడీ ఘనంగా చెప్పుకున్న ప్యాకేజీని పనికిరాని ప్యాకేజీగా పేర్కొన్నారు. దుర్మార్గం అన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వల్ల ఎవరికీ ఏమీ ఒరగదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ప్యాకేజీ మొత్తం ప్రకటించాక దానిని అధ్యయనం చేసి తాజా మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. 

కేంద్రం బిక్ష వేసినట్లు ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. ఎఫ్ఆర్బీఎం పెంచమని చెబితే... దానికి సవాలక్ష కండిషన్లు పెట్టారని... మేము తెచ్చుకునే లోను, మేము కట్టుకునే లోను... అయినా పనికిమాలిన హాస్యాస్పదమైన కొర్రీలు పెట్టి కేంద్రం నవ్వుల పాలైందని కేసీఆర్ విమర్శించారు. 

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఉత్త బోగస్ ప్యాకేజీ  అని దాంతో ఎవరికీ ఏం ఒరగదని కేసీఆర్ వెల్లడించారు. మోదీ ప్యాకేజీ నియంతృత్వంగా ఉందని... సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. ఈ  ప్యాకేజీని మన దేశంలో ప్రతిపక్షాలే కాదు, విదేశాలు, అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తున్నాయని కేసీఆర్ వివరించారు.

రాష్ట్రాల చేతుల్లోకి నగదు వచ్చేలా ప్యాకేజీలు రూపొందించి ఉంటే వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేదని అన్నారు. ఈ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా మోడీ తనలోని భూస్వామ్యవాద లక్షణాలు బయటపెట్టుకోవడం తప్ప ఇంకేం లేదన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో దేశంలోని అన్ని వ్యవస్థలు ప్రైవేట్ పరం అవుతాయని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల నుంచి కేంద్రం సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేసి రాష్ట్రాలను ముంచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి మోడీకి కేసీఆర్ కటీఫ్ చెప్పారు.