తిడితే కేసీఆర్లా తిట్టాలి... పొగిడితే జగన్ లా పొగడాలి

July 07, 2020

ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌రో రాష్ట్ర ముఖ్య‌మంత్రిని పొగడ‌టం చూశారా? ప‌క్క ప‌క్క రాష్ట్రాలుగా.. నీటి పంచాయితీలు మొద‌లుకొని.. ఉద్యోగుల వ్య‌వ‌హారం వ‌ర‌కూ నిత్యం ఇష్యూల‌తో ఉండే రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అన్యోన్య‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి అంత‌కంత‌కూ పెర‌గ‌టం తెలిసిందే. అదెంత పీక్స్ కు వెళ్లింద‌న్న విష‌యం ఈ రోజు (గురువారం) ఏపీ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌సంగం చూసినంత‌నే అర్థం కాక మాన‌దు.
నీళ్ల కోసం ఆవురావుర‌మంటున్న ఏపీకి గోదావ‌రి నీళ్ల‌ను శ్రీ‌శైలం ద్వారా ఇచ్చేందుకు వీలుగా కేసీఆర్ మాష్టారు భారీగా ప్లాన్ చేసిన స‌రికొత్త ప్రాజెక్టును జ‌గ‌న్ ఓకే చేయ‌టం.. దానికి సంబంధించిన వివ‌రాల్ని ఏపీ అసెంబ్లీలో చెప్పే క్ర‌మంలో కేసీఆర్ ను ఉద్దేశించి ఆయ‌న పొగిడిన పొగ‌డ్త‌లు విన్నంత‌నే తెలంగాణ ప్ర‌జ‌లు సైతం సిగ్గుప‌డే ప‌రిస్థితి.
త‌మ ముఖ్య‌మంత్రిలోని టాలెంట్ ను తాము గుర్తించ‌లేదు కానీ.. పొరుగున ఉన్న ఏపీ ముఖ్య‌మంత్రి ఇంత‌లా పొగిడేయ‌ట‌మా? అని ఆశ్చ‌ర్య‌పోయారు. ఇక‌.. టీఆర్ఎస్ నేత‌లు అయితే గుండెలు బాదుకోవ‌ట‌మే ఒక్క‌టే త‌క్కువ‌. సారును పొగ‌డాల‌ని తెలుసుకానీ.. మ‌రీ ఈ స్థాయిలో పొగ‌డొచ్చ‌న్న విష‌యాన్ని గులాబీ నేత‌లు జ‌గ‌న్ బాబు మాట‌ల్ని విన్న త‌ర్వాతే అర్థ‌మైంద‌ట‌. ఏ మాట‌కు ఆ మాటే పొగిడితే ఆంధ్రా సీఎం జ‌గ‌న్ మాదిరి పొగ‌డాలి. తిడితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరి ఉండాల‌న్న‌ది ఇప్పుడు ప్రామాణికంగా మారిన‌ట్లు చెబుతున్నారు.
తాజాగా ప్రాజెక్టు గురించి ఏపీ అసెంబ్లీలో జ‌గ‌న్ వివ‌రించిన తీరు చూసిన త‌ర్వాత‌.. చాలామందికి వ‌చ్చిన చ‌క్క‌టి ఐడియా ఏమంటే.. గ‌డిచిన కొద్ది కాలంగా కేసీఆర్ ను పొగిడేటోళ్లు పెద్ద‌గా క‌నిపించ‌ట్లేదు. ఒక‌వేళ పొగిడినా కూడా.. అంత ఎఫెక్ట్ ఉండ‌ని ప‌రిస్థితి. ఇలాంటివేళ తాజాగా జ‌గ‌న్ ప్ర‌సంగం చూసిన త‌ర్వాత కేసీఆర్ మంచితాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో జ‌గ‌న్ కు తెలిసినంత బాగా హోల్ తెలంగాణ‌లో ఎవ‌రికి తెలీద‌న్న విష‌యం అర్థ‌మైన‌ట్లేన‌ని చెబుతున్నారు. కావాలంటే పోటీ పెట్టినా జ‌గ‌నే ముందుకు వ‌స్తారు బ‌స్తీమే స‌వాల్ అనేటోళ్లు కూడా లేక‌పోలేదు.
అందుకే.. కేసీఆర్ మంచితనాన్ని.. గొప్ప‌త‌నాన్ని.. వీర‌త్వాన్ని.. దాతృత్వాన్ని విచ్చ‌ల‌విడిగా పొగిడేసే జ‌గ‌న్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా పెడితే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది. రెండు ప‌క్క‌ప‌క్క రాష్ట్రాలు సోద‌ర‌భావంతో మెల‌గాలంటే.. అందునా కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్ మ‌రింత బ‌లోపేతం కావాలంటే.. ఆయ‌న‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తే.. వ్య‌క్తిగ‌త అభిమానంతో పాటు.. ప్ర‌త్యేకంగా గుర్తించి మ‌రీ ఉద్యోగం ఇచ్చిన దానికి త‌గ్గ‌ట్లు.. రెమ్యున‌రేష‌న్ లెక్క‌న వ‌చ్చే మొత్తానికి త‌గ్గ న్యాయం చేసే గుణం జ‌గ‌న్ కు మాత్ర‌మే ఉంటుందంటున్నారు. తెలంగాణ సాధించిన వెంట‌నే తెలంగాణకుబ్రాండ్ అంబాసిడ‌ర్ ను పెట్టుకున్నారే త‌ప్పించి కేసీఆర్‌కు మాత్రం నియ‌మించుకోలేదు. ఆ అవ‌స‌రం ఎంత‌న్న విష‌యాన్ని చెప్పేలా ఏపీ అసెంబ్లీలో జ‌గ‌న్ త‌న మాట‌ల‌తో చెప్పేశార‌ని చెప్పాలి. మ‌రి.. ఆల‌స్యం ఎందుకు? కేసీఆర్ కు జ‌గ‌న్ ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించేస్తే పోలా?