పొడిగింపు ప్రపోజల్ పెట్టి కామ్ గా ఉన్నారేంది కేసీఆర్?

June 03, 2020

కీలకమైన విషయాల్లో అందరికంటే మెరుగ్గా ఆలోచించే సత్తా తనకెంత ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ఫ్రూవ్ చేశారు కూడా. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం.. దాని గడువు ఈ నెల 14తో ముగియనున్న వేళ.. అందరి కంటే ముందుగా ఈ అంశంపై స్పందించారు కేసీఆర్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే లాక్ డౌన్ పొడిగింపుకు మించి మరో మార్గం లేదని తేల్చారు. లాక్ డౌన్ ను కనీసం రెండు వారాలు పొడిగించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఈ విషయాన్ని తాను ప్రధానికి విన్నవిస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని అందరి కంటే ముందుగా తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. కామ్ గా ఉండిపోయారు.
మరోవైపు లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. ఈ నెల 30 వరకూ పొడిగించాలన్న నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రధాని నిర్ణయంతో పని లేకుండా లాక్ డౌన్ ను తమ రాష్ట్రంలో పొడిగిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. పొడిగింపు ప్రపోజల్ పెట్టిన కేసీఆర్.. ప్రధాని మాట కోసం వెయిట్ చేస్తుంటే.. మరోవైపు మిగిలినరాష్ట్రాల వారు మాత్రం పొడిగింపు నిర్ణయాన్ని తీసేసుకోవటం గమనార్హం.
వాస్తవానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిర్ణయాన్ని వెల్లడించటానికి ముందే.. తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తీసుకోవటాన్ని మర్చిపోకూడదు. అలాంటి సీఎం సారు.. పొడిగింపు విషయంలో మాత్రం ప్రపోజల్ పెట్టి కూడా కామ్ గా ఎందుకు ఉన్నట్లు? అన్నది క్వశ్చన్ గా మారింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉండటం.. మరో పది రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
పొడిగింపు ఆలోచన ఉన్నప్పటికీ.. పరిస్థితి కంట్రోల్ లోకి వస్తున్న నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాలతో సంబంధం లేకుండా.. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పరిమితులతో లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయిన నేపథ్యంలో.. వీలైనంత త్వరగా లాక్ డౌన్ ను ఎత్తేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ విషయంలో ఏ మాత్రం తొందరపడినా మొదటికే మోసం రావటమే కాదు.. కొత్త కష్టాల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆచితూచి నిర్ణయం కోసమే ఆగినట్లుగా చెబుతున్నారు.