జ‌గ‌న్ జాబితా విడుద‌ల‌లో కేసీఆర్ జాడ‌లు!

May 21, 2019

హోరాహోరీగా సాగ‌నున్న ఏపీ ఎన్నిక‌ల్లో ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌న తొలి జాబితాను విడుద‌ల చేసే విష‌యంలో మ‌రింతగా క‌స‌ర‌త్తు చేయ‌నుంది. మారిన స‌మీక‌ర‌ణాల‌కు త‌గ్గ‌ట్లు జాబితా విడుద‌ల ఉండ‌నుంది. అంతేకాదు.. జాబితా విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని భావోద్వేగంగా నిర్వ‌హించేలా జ‌గ‌న్ పార్టీ ప్లాన్ చేస్తుంద‌ని చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థులు విసురుతున్న విమ‌ర్శ‌ల‌కు ధీటుగా స‌మాధానం ఇవ్వ‌టంతో పాటు.. హైద‌రాబాద్ బూచిని చూపిస్తున్న చంద్ర‌బాబుకు షాకిచ్చేలా జాబితా విడుద‌ల కార్య‌క్ర‌మంలో జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు.

ముందుగా అనుకున్న దాని ప్ర‌కారం 75 మంది చొప్పున తొలి రెండు జాబితాల్ని విడుద‌ల చేయాల‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా మారిన ప్లాన్ తో వ్య‌హాన్ని పూర్తిగా మార్చేశారు. వ‌రుస‌గా మూడు రోజుల పాటు 75 మంది చొప్పున అభ్య‌ర్థుల జాబితాను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

అయితే.. విడ‌త‌ల వారీగా అభ్య‌ర్థుల పేర్ల‌ను విడుద‌ల చేసే క‌న్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి వీలైనంత‌మంది అభ్య‌ర్థుల జాబితాను ఒకేసారి రిలీజ్ చేయాల‌న్న యోచ‌న‌లోకి జ‌గ‌న్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా అనుకుంటున్న దాని ప్రకారం మ‌రో రెండు రోజులు ఆగి.. ఈ నెల  16న  తొలి అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. 

మొత్తం 140 మంది అసెంబ్లీ అభ్య‌ర్థులు.. 15 మంది ఎంపీ అభ్య‌ర్థుల పేర్ల‌తో తొలి జాబితా విడుద‌ల కానుంది. ఈ జాబితాను ఇడుపుల‌పాయ‌లోని వైఎస్ స్మృతి చిహ్నం వ‌ద్ద ఉంచిన త‌ర్వాత మీడియాకు విడుద‌ల చేయ‌నున్నారు. జాబితాను విడుద‌ల చేసిన కాసేప‌టికే ఇడుపులపాయ నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఏప్రిల్ 16 ఉద‌యం 10.26 గంట‌ల‌కు ఇడుపుల‌పాయ నుంచి బ‌య‌లుదేర‌నున్న జ‌గ‌న్‌.. అదే రోజు మ‌ధ్యాహ్నం గుంటూరు జిల్లా గురుజాల నియోజ‌క‌వ‌ర్గంలోని పిడుగురాళ్ల‌లో త‌న తొలి ప్ర‌చార స‌భ‌లో పాల్గొన‌నున్నారు. 

రోజుకు మూడు జిల్లాల్లోమూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌గ‌న్ ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌నున్నారు. తొలుత అనుకున్న‌ట్లుగా బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేసినా.. ఎన్నికల ప్ర‌చారానికి త‌క్కువ స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ ద్వారా ప్ర‌చారానికి తెర తీయ‌నున్నారు. 

ఇటీవ‌ల నిర్వ‌హించిన పాద‌యాత్ర‌తో 134 నియోజ‌క‌వ‌ర్గాల్ని జ‌గ‌న్ క‌వ‌ర్ చేశారు. మిగిలిన 41 నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు.. అభ్య‌ర్థుల్ని మార్చిన చోట్ల కూడా జ‌గ‌న్ ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పుడున్న ప్ర‌చార‌ వ్యూహం ప్ర‌కారం ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఉన్న చివ‌రి మూడు రోజులు మాత్రం జిల్లా కేంద్రాల్లో స‌భ‌ల్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.