ముఖ్యమంత్రిపై అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

February 19, 2020

ఉద్యమాలకు ఉన్న గొప్ప లక్షణం..కొత్త తరం నాయకుల్ని అందిస్తుంది. ఈ రోజున తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారిన కేసీఆర్ ఒకప్పుడు సాదాసీదా నేత మాత్రమే. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆయన బలాన్ని అంతకంతకూ పెంచుకోవటమే కాదు.. చివరకు తెలంగాణ ప్రజలకు ఆయన తప్పించి మరే ప్రత్యామ్నాయం లేనట్లుగా మారిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. కోరి తెచ్చుకోవటమే కాదు.. అంతకంతకూ ముదిరిపోయేలా ఆర్టీసీ సమ్మెకు కారణం కేసీఆర్ అనే చెప్పాలి.
ఆయన పట్టుదల.. మొండితనం.. తనను కాదన్న వారి సంగతి చూసేందుకు ఎంతవరకైనా వెళ్లాలన్న పట్టుదల లాంటివన్నీ కొత్త తరం నాయకుల్ని.. నాయకత్వాన్ని తెర మీదకు తీసుకొస్తుంటాయి. తాజాగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో చూస్తే.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల్లో కీలకమైన అశత్థామరెడ్డి దీనికో ఉదాహరణగా చెప్పాలి. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వేళ.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షంలో మంట పుట్టించటమే కాదు.. సంచలనంగా మారాయి.
ఇటీవల కాలంలో మరే ఉద్యమనేత ఇంత తీవ్రస్థాయిలో కేసీఆర్ ను దునుమాడటం చూడలేదు. ఆ కొరతను తీరుస్తూ అశ్వత్థామరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలాన్ని రేపేలా ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేరుగా వార్నింగ్ ఇచ్చేసినట్లు ఉన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..
% ప్రస్తుత ముఖ్యమంత్రి.. అనాటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ కు మేం వెన్నంటి ున్నాం. ఆ స్ఫూర్తితోనే కోట్లాడి ఆర్టీసీని కాపాడుకుంటాం. మేధావుల మౌనం మంచిది కాదు. సమ్మె విషయంలో వారు మౌనం వీడాలి. కేకే అంటే నీతి.. నిజాయితీ ఉన్న వ్యక్తి.. ఆయన మాటలు చూస్తే.. ఆయన మాకు మద్దతు ఇచ్చినట్లే.
% అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడుతున్నారు. సీఎం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. నేను నియంతను.. నేనే రాజును అనుకుంటే కుదరదు. ప్రజా వ్యతిరేకత వస్తే ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్ లాంటి మహానాయకుడి ప్రభుత్వమే నాలుగు నెలల్లో కుప్పకూలింది. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కూడా రావొచ్చు.
% మంత్రులు హరీశ్ రావు.. ఈటెల రాజేందర్.. జగదీశ్ రెడ్డి.. నిరంజన్ రెడ్డి లాంటి మేధావులు మౌనం వీడాలి. తెలంగాణ సమాజం కోసం ఎవరైతే కదిలారో.. వాళ్లనే అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు.
% కేబినెట్ లో ఉద్యమ మంత్రులు బయట మమ్మల్ని తిడుతున్నారు. ఇంటికెళ్లి ఏడుస్తున్నారు. అన్నా ఇలా అయిపోతుందేమిటి అంటూ ఫోన్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణ మంత్రుల పరిస్థితి షరా మామూలే.  
% కేవలం నాయకులే సమ్మె చేస్తున్నారని ఎర్రబెల్లి అంటున్నారు. 48,500 మంది కార్మికుల్ని నాయకులుగా గుర్తించినందుకు ధన్యవాదాలు.
% ప్రైవేటు బస్సుల కోసం తెలంగాణ రాష్ట్రం టెండర్లు పిలిస్తే.. పక్క రాష్ట్రం అక్కడ ఆర్టీసీ బస్సులు కొనేందుకు సిద్ధమైంది? మీరు గొప్పా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గొ్ప్పా?
% మీ వియ్యంకుడి బంధువు.. నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ విఠల్ రావు కుమారుడు సందీప్ కు 46 పెట్రోలు బంకులు కట్టబెట్టారు.. అది నిజం కాదా?
% సమ్మెపై చర్చలకు ఆహ్వానిస్తే సిద్ధంగా ఉన్నాం. అలా అని ప్రగతిభవన్ గేట్ల దగ్గర నిలబడి లేము.. ఆత్మగౌరవంతో ఉన్నాం.