కేసీఆర్ సూపర్ మాయ... ఈ లాజిక్ మిస్సయ్యాడు !!

August 12, 2020

అమ్మ పెట్టదు కానీ చిన్నమ్మను అడగమంటుందన్నట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తే. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. దాని మీదనే తరచూ మాట్లాడేస్తారు.. ఆ తర్వాత దాన్ని వదిలేస్తారన్న విషయం తెలంగాణలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అయితే.. అభినందించాల్సిన అంశం ఏమంటే.. ఇష్యూను పట్టుకున్న వేళలో మాత్రం.. అదే పనిగా దాని గురించి మాట్లాడటమే కాదు.. ఇలాంటివి చేయగలిగింది కేసీఆర్ మాత్రమే అన్న భావన కలిగించటంలో మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్ అని చెప్పక తప్పదు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించిన సమయంలో.. తెలుగు విషయంలో సారు చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏ మాత్రంసంబంధం ఉండదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

అంతెందుకు? ఆ మధ్యన వారంలో తీపికబురు చెబుతానని చెప్పిన కేసీఆర్ నెల రోజులు దాటినా దాని ప్రస్తావనే లేదు. దాన్ని కూడా వదిలేద్దాం. ఆ మధ్యన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా మీడియా సంస్థలు కొన్ని జీతాలు ఇవ్వకుండా కోత పెడుతున్నాయని చెప్పినప్పుడు.. అదెలా.. మనం మాట్లాడుకుందామన్న ఆయన.. ఆ తర్వాత దాని ఊసే ఎత్తని వైనం చూస్తే.. తియ్యటి మాటలు చెప్పే కేసీఆర్.. పనులు చేసే విషయంలో మాత్రం పొంతన ఉండదంటారు.

గడిచిన కొద్దిరోజులుగా పీవీ నరసింహారావు జపం చేస్తున్న ఆయన.. శతజయంతి ఉత్సాహాల్ని ప్రారంభించిన సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత రత్న ఇవ్వాలని.. స్టాంపు విడుదల చేయాలని.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలంటూ కేంద్రం ముందు డిమాండ్ల చిట్టా పెట్టిన ఆయన.. తన చేతిలో ఉన్న అధికారంలో ఆయన పుట్టిన జిల్లాకు ఆయన పేరెందుకు పెట్టరు? అన్నది ప్రశ్న.

టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువు తీరి ఆరేళ్లు దాటింది. మరి.. ఈ ఆరేళ్లలో మస్తు పథకాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. పెద్దాయనకు గౌరవం ఇస్తున్న వైనాన్ని గుర్తు చేస్తూ.. ఆయన పేరుతో ఏదైనా పథకాన్ని ఎందుకు ప్రారంభించలేదన్నది ప్రశ్న.

మనసుంటే మార్గం ఉండకుండా ఉండదు. నిజంగా తెలంగాణకు గర్వకారణమైన పీవీని స్మరించుకోవాలంటే శతజయంతి ఉత్సవాలే ఉండనక్కర్లేదు. మనసులో కూసింత జాగా ఇచ్చి.. ఆ పెద్ద మనిషి గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవటం చాలా అవసరమని అనుకుంటే.. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడేవి. అందుకు భిన్నంగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి పెడుతున్న వైఫల్యాల్ని కప్పిపుచ్చేలా పీవీ జపం చేస్తే.. చేసిన తప్పులు కవర్ అయిపోతాయా? అన్నది ప్రశ్న.