హైకోర్టు తప్పు పట్టినా.. లైట్ తీసుకున్న కేసీఆర్

August 05, 2020

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పు పట్టటం కొత్తేం కాదు. తరచూ కాకున్నా.. అప్పుడప్పుడు చోటు చేసుకునే ఈ తరహా ఉదంతాలపై ప్రభుత్వాలు ఆచితూచి అన్నట్లుగా రియాక్ట్ అవుతుంటాయి.

కోర్టు తప్పు పట్టిన అంశాలపై తమ తీరును మార్చుకోవటం ఇప్పటివరకూ జరిగేది. తాజాగా అందుకు భిన్నంగా వ్యవహరించి కొత్త చర్చకు తెర తీశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

రెండు రోజుల క్రితం పెన్షనర్లకు కోత విధిస్తూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరును తప్పు పట్టింది. వయసు మళ్లిన తర్వాత వారికి వచ్చే ఆదాయ మార్గాన్ని అడ్డుకోవటంలో అర్థమేమిటన్న అర్థం వచ్చేలా ఆక్షింతలు వేసింది. వారి విషయంలో తీరు మార్చుకోవాలన్న సూచనతో పాటు.. విచారణను వాయిదా వేసింది.

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందన్న ఆసక్తి వ్యక్తమైంది. అనూహ్యంగా మంగళవారం రాత్రి కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆదాయం తగ్గిపోవటంతో ఉద్యోగుల వేతనాలు.. పెన్షన్లలో కోత విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకునేలా ఆర్డినెన్స్ ను జారీ చేసింది.

హైకోర్టు వ్యాఖ్యలకు సమాధానం అన్నట్లుగా.. రాష్ట్రంలో ఏదైనా విపత్తు లేదంటే ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితి చోటు చేసుకున్నప్పుడు ఏ వ్యక్తికైనా.. సంస్థకైనా.. పెన్షనర్లకు చెల్లింపులు వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెబుతూ ఆర్డినెన్సును జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోలేక.. రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకురావటంపై టీఎస్ యూటీఎఫ్ ఖండిస్తోంది.

తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం చూస్తే.. తనను ఎవరూ ప్రభావితం చేయలేరన్న విషయాన్ని కేసీఆర్ మరోసారి చేతల్లో చేసి చూపించారని చెప్పక తప్పదు.