అవును... తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి జగన్ హెల్ప్

May 24, 2020

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సారథి, ఏపీ ముఖ్యమంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఉన్న స‌ఖ్య‌త గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల సమ‌యంలో ఈ బంధం బ‌ల‌ప‌డింది. ఏపీలో జ‌గ‌న్ గెలుపుతో ఇది మ‌రింత చిక్క‌ప‌డింది. ఈ స‌ఖ్య‌త‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యం భ‌వ‌నాల‌ను అప్ప‌గించేందుకు వైఎస్ జ‌గ‌న్ అంగీక‌రించి సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ త‌దుప‌రి ఎపిసోడ్‌లో భాగంగా త‌న చిరకాల వాంచ నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. కొత్త సెక్ర‌టేరియ‌ట్ శంకుస్థాప‌న‌కు రెడీ అవుతున్నారు.

కేసీఆర్ మొద‌టసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొత్త స‌చివాల‌యం నిర్మాణం చేప‌ట్టాల‌ని భావించినా.. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.ఇందుకోసం ఓ సంద‌ర్భంలో చాతి ఆస్ప‌త్రిని ప్ర‌తిపాదించ‌గా కోర్టు కేసుల కార‌ణంగా ఉప‌సంహ‌రించారు. దీంతో కొత్త స‌చివాల‌య నిర్మాణానికి సంబందించి బైస‌న్ పోలో గ్రౌండ్ పై ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. అది రక్షణశాఖ ఆధీనంలో ఉండ‌టంతో కేంద్రం ఎటూ తేలడంలేదు. అయిన‌ప్ప‌టికీ కేసీఆర్ త‌న కొత్త స‌చివాల‌య కాంక్ష‌ను ప‌క్క‌న‌పెట్ట‌లేదు. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ప్రస్తుత సచివాలయ స్థానంలోనే కొత్త నిర్మాణం చేపట్టడం మేలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఏపీ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే రెండు ద‌శ‌ల్లో కొత్త స‌చివాల‌య నిర్మాణానికి ప్లాన్ చేశారు.

ఏపీ ఆధీనంలోని భ‌వ‌నాల‌ను తెలంగాణ‌కు తిరిగివ్వాల‌ని వారం క్రితం గవర్నర్ ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో భ‌వ‌నాల‌న్నిటిని తీసుకునే ప‌నిలో తెలంగాణ స‌ర్కారు ప‌డింది. తాజాగా స‌చివాల‌యంలో తెలంగాణ సీఎస్ జోషి తో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఏపీ తరపున ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ తరపున రామకృష్ణారావు హాజరు అయ్యారు. గవర్నర్ ఉత్వర్వుల మేరకు ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. ఏపీ ఆధీనంలో ఉన్న భ‌వ‌నాల అప్పగింత వారం రోజుల్లో పూర్తి చేయాల‌ని అధికారులు ప్లాన్ చేశారు. సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి అప్పగించాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు. దీంతో కొత్త స‌చివాల‌యం నిర్మాణానికి సిద్ధ‌మ‌య్యారు. ముందుగా వాస్తుకు అనుకూలంగా లేని ఏ,బి,సి,డి బ్లాకుల‌ను కూల్చి నిర్మాణ ప‌నులు మొద‌లు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆ వెంట‌నే రెండో ద‌శ‌లో పూర్తి స్థాయిలో స‌చివాల‌య నిర్మాణం కంప్లీట్ అయ్యేలా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైనట్టు సమాచారం. ఈ నెల 27వ తేదీలోగా కొత్త సచివాలయ భవనానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయబోతున్నారు. స్థూలంగా కేసీఆర్ ఏళ్ల క‌ల‌ను జ‌గ‌న్ నెర‌వేర్చ‌నున్నారు.