కేసీఆర్ దిగొచ్చేలా చేశారుగా...

August 12, 2020

ఎట్టకేలకు కేసీఆర్ దిగివచ్చారు. కెసిఆర్ దిగి వ‌చ్చారు అనడం కంటే టిఆర్ఎస్ నేతలు అందరూ ఒక్కసారిగా తమ అసంతృప్తి వినిపించి ఆయన దిగి వచ్చేలా చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ లో చేరిన నేతలు.... తాజాగా వచ్చిన చేరిన నాయకులు... పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు.. ఎవరికి వారు తమకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని... వ్యతిరేకంగా పని చేసిన వారిని కూడా కెసిఆర్ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారు.
రెండోసారి గెలిచాక కూడా చాలామంది నేతలను కేసీఆర్ పార్టీలో చేర్చుకుని పదవులు ఇవ్వడంతో.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి రుచించలేదు. దీంతో పార్టీలో నిరసనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక గత నెల రోజులుగా చాలా మంది నేతలు ఓపెన్ గానే తమ అసంతృప్తిని వినిపిస్తున్నారు. మామూలుగా ఎవరైనా ధిక్కార‌స్వ‌రం వినిపిస్తే చాలా లైట్ తీసుకునే కేసీఆర్ పార్టీలో ధిక్కార‌ స్వరాలు రోజురోజుకు పెరుగుతుండడంతో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరందరికీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు బ‌లాన్ని ఇచ్చాయి. ఈటల మాటలపై టీఆర్‌‌ఎస్‌‌ అధినేతలు అంతగా స్పందించినట్టు కనిపించకపోయినా తర్వాత మొదలైన ప్రకంపనలపై వెంటనే దృష్టి పెట్టారు. ఈ అసంతృప్తులు రోజురోజుకు పెరుగుతూ ఉంటే పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని భావించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి వారిని బుజ్జ‌గిస్తున్నారు.
ఈ క్రమంలోనే సదరు నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి.... ప్రెస్‌నోట్ రిలీజ్ చేసి తాము అసంతృప్తితో లేదని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కెసిఆర్‌కు ఎంతో విధేయ‌త‌తో ఉంటున్నామని ప్రకటిస్తున్నారు. కేటీఆర్ కి ఎన్ని చేసినా టీఆర్ఎస్‌లో చాలామంది నాయకుల్లో అసంతృప్తి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఎప్పుడైనా బ్లాస్ట్ అవ్వ‌నుంది. ఏదేమైనా పార్టీ నేత‌లు ధిక్కార స్వ‌రం వినిపించ‌క‌పోతే త‌ప్ప మ‌న‌ల‌ను గుర్తించ‌ర‌నుకున్న వాళ్లంద‌రూ క‌లిసి క‌ట్టుగా కేసీఆర్ దిగొచ్చేలా చేస్తున్నారు.