అలిగిన నేత‌ను ముఖ్య ప‌ద‌వితో..ఐస్ చేసిన కేసీఆర్‌

July 12, 2020

పార్టీకి ఏళ్లుగా సేవ చేసిన‌ప్ప‌టికీ...కీల‌క ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ...త‌న‌ను లైట్ తీసుకోవ‌డంతో అసంతృప్తికి గురైన పార్టీ సీనియ‌ర్ నేత‌ను ఐస్ చేసే ప్ర‌య‌త్నం చేశారు టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా పార్టీ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి, శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని  బుజ్జ‌గించేలా...రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో గ‌త కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మ‌ధ్య నెల‌కొన్న గ్యాప్‌కు ఫుల్ స్టాప్ ప‌డింద‌ని అంటున్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్య‌ద‌ర్శి, త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన ప‌ల్లాను ఇంచార్జీగా నియమించిన పార్టీ అధినేత కేసీఆర్‌ హుజూర్‌నగర్‌లోనే మకాం వేసి పార్టీ ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను అప్పగించారు. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులను పల్లా సమన్వయం చేసుకోవాల‌ని సూచించారు. దీంతో ఆయ‌న చెమ‌టోడ్చారు. పార్టీ గెలుపొందింది. హుజూర్ నగర్ ఎన్నిక ఇంచార్జీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కృషిని మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అయితే, అనంత‌రం న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగిన గ్రీన్ ఇండ‌స్ట్రీయల్ పార్క్ ప్రారంభోత్స‌వానికి కేటీఆర్ హాజ‌ర‌వ‌గా...అదే జిల్లాకు చెందిన నేత అయిన ప‌ల్లాకు మాత్రం ఆహ్వానం ద‌క్క‌లేదు. దీంతో...ప‌ల్లా అసంతృప్తిలో ఉన్న విష‌యం పెద్ద ఎత్తున వైర‌ల్ అయింది.

అనంత‌రం ఆయ‌న పెద్ద‌గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో సైతం పాల్గొన‌డం లేదు. ఈ నేప‌థ్యంలో...తాజాగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మొత్తంగా ముఖ్య‌నేత అసంతృప్తికి కేసీఆర్ ఇలా చెక్ పెట్టార‌ని ప‌లువురు అంటున్నారు.