మోత్కుపల్లికి మరోసారి షాకిచ్చిన కేసీఆర్

July 05, 2020

తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రస్తుతం రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ టీడీపీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయాలంటూ వ్యాఖ్యానించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనపై సంచలన ఆరోపణలు చేసిన మోత్కుపల్లి.. పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ పరిణామం తర్వాత మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌, జనసేనలో చేరుతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఆయనను చేర్చుకోడానికి అన్ని పార్టీలూ విముఖత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గత డిసెంబర్‌లో జరిగిన ముందుస్తు ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో దారుణంగా ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్‌గా ఉండిపోయిన ఆయన.. ఈ మధ్య తరచూ మీడియా ముందుకు వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. మోత్కుపల్లి నర్సింహులు తన నోటికి పని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఓడిస్తానని గతంలో చెప్పిన ఆయన.. తాజాగా ఆ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు, ఏపీలో టీడీపీని ఓడించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. గతంలో మోత్కుపల్లిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీని విమర్శించాలని మోత్కుపల్లిని కోరారనే టాక్ వినిపిస్తోంది. ఇలా చేయడం ద్వారా వైసీపీకి లాభం చేకూరే అవకాశం ఉందని ఆ పార్టీ భావించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే మోత్కుపల్లి.. ఎన్నికల ముంగిట టీడీపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈ సీనియర్ నేతకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు షాకిచ్చారని తెలుస్తోంది.

గతంలో మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరికకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. ఆ సమయంలో ఆలేరు ఎమ్మెల్యే టికెట్ గానీ, గవర్నర్ పదవి గానీ ఇప్పించాలని మోత్కుపల్లి.. గులాబీ బాస్‌ను కోరారు. దీనికి తాను హామీ ఇవ్వలేనని బేషరతుగా చేరితే చేరండి అని కేసీఆర్ తేల్చేశారు. దీంతో మోత్కుపల్లి వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినేత రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన సీనియర్లను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోత్కుపల్లి టీఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులకు చెప్పడం.. వాళ్లు అధినేత చేవిలో ఊదడం చేశారని తెలిసింది. అయితే, దీనికి కేసీఆర్ ఒప్పుకోలేదని సమాచారం. 35 ఏళ్ల అనుభవం ఉన్న మోత్కుపల్లికి కేసీఆర్ మరోసారి షాకిచ్చారన్న మాట.