అలాంటి క్వ‌శ్చ‌న్లు వేస్తే కేసీఆర్ కి కోపం రాదా మరి?

October 17, 2019

తిరుగులేని రీతిలో అధికారం చేతికి ఇచ్చిన త‌ర్వాత కిమ్మ‌న‌కుండా ఊరుకోవాలే కానీ.. అదే ప‌నిగా ప్ర‌శ్న‌లు సంధించ‌టంలో అర్థం ఉందా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఏం కోరుకుంటున్నారు? పాత చింత‌కాయ తొక్కులాంటి భ‌వ‌నాల స్థానంలో కొత్త‌గా మిల‌మిల మెరిసేలా ఏ ప‌ల్లోంజీ వాళ్ల చేత‌నో.. ఎల్ అండ్ టీ వాళ్ల‌తోనో.. కాదంటే మ‌న మైహోం పెద్దాయ‌న‌తోనో.. కాదంటే కాళేశ్వ‌రం క‌థా పురుషుడు మెగా కృష్ణారెడ్డి చేత‌నో భారీ స‌చివాల‌యాన్ని.. విశాల‌మైన అసెంబ్లీని కోరుకుంటున్నారు.
దూర‌దృష్టితో భ‌విష్య‌త్తు తెలంగాణ‌.. మ‌రి ముఖ్యంగా హైద‌రాబాద్ ఎలా ఉండాలో కోరుకునే కేసీఆర్ ను అదే ప‌నిగా క్వ‌శ్చ‌న్లు వ‌స్తే కోపం రాదు. జానెబెత్తుడు క‌డుపును నింపుకోవ‌టానికి కిందామీదా ప‌డేటోడ్ని అదే ప‌నిగా ప్ర‌శ్న‌లు అడిగితే కోపం వ‌చ్చేసే ఈ రోజుల్లో రెండుసార్లు తెలంగాణ‌కు తిరుగులేని ప‌వ‌ర్ గా మారిన కేసీఆర్ లాంటి వారు తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్ని ప్ర‌శ్నిస్తే ఆగ్ర‌హం రాకుండా ఉంటుందా? ఉమ్మ‌డిరాష్ట్రంలో 294 మందికి స‌రిపోయిన భ‌వ‌నం 119 మంది స‌భ్యులున్న తెలంగాణ ఎమ్మెల్యేల‌కు స‌రిపోదా? అంటూ లాజిక్ ప్ర‌శ్న‌లు చిరాకు తెప్పిస్తాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.
అందుకే.. అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఎర్ర‌మంజిల్ వ‌ద్ద నిర్మించాల‌ని డిసైడ్ అయిన కేసీఆర్ తీరును ప‌లువురు త‌ప్పుప‌డుతూ కోర్టుకు ఎక్కిన నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం త‌న వాద‌న‌ను వినిపించింది. అసెంబ్లీ కొత్త భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని డిసైడ్ అయిన త‌మ ప్ర‌భుత్వ విధానప‌ర‌మైన నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించిన తీరుపై కేసీఆర్ కు ఎంత‌లా మండుతుంద‌న్న విష‌యం తాజాగా హైకోర్టుకు దాఖ‌లు చేసిన కౌంట‌ర్ లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. అసెంబ్లీ నిర్మాణాన్ని అడ్డుకునేలా వేసిన పిటిష‌న్ లకు కౌంట‌ర్ వేస్తూ.. త‌మ వాద‌న‌ను వినిపించింది తెలంగాణ ప్ర‌భుత్వం.
‘‘మంచి పాలనను అందించడంలో భాగంగా ప్రభుత్వం చట్ట సభల సముదాయాన్ని నిర్మించాలన్న విధాన నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు. నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొంది. ఎర్రమంజిల్‌ భవనం చారిత్రక కట్టడం పరిధిలోకి రాదు. చారిత్రక పరిరక్షణ కమిటీ నుంచి ఎలాంటి అనుమతులు అవసరంలేదు. ప్రస్తుత శాసనసభ ప్రాంగణంలో నిజాం కాలంలో నిర్మించిన టౌన్‌ హాలు. 25 గదులు, 5 కమిటీ హాళ్లున్నాయి. ముఖ్యమంత్రి, స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, ప్రతిపక్ష నేత, మంత్రులకు సరైన వసతుల్లేవు. కార్యదర్శికి కూడా కార్యాలయం లేదు. 2017 ఆగస్టులో రోడ్లు భవనాల శాఖ పరీక్షించి సెప్టెంబరు 4న నివేదిక ఇస్తూ మండలి భవనం సురక్షితం కాదు’’ అని పేర్కొంది. మ‌రి.. ఎన్నో ఆలోచ‌న‌ల‌తో సారు డిసైడ్ అయ్యాక‌.. అదే ప‌నిగా అడ్డుప‌డితే అంత పెద్ద కేసీఆర్ ప్ర‌భుత్వం త‌న‌దైన శైలిలో రియాక్ట్ కాకుండా ఉంటుందా ఏంటి?