రచ్చబండ: పనిలోపని జగన్ శిల్పం కూడా చెక్కాల్సిందిగా..

July 07, 2020

తెలంగాణలో కేసీఆర్‌కు పెద్ద చిక్కే వచ్చి పడింది. తన కలల ప్రాజెక్టు యాదాద్రి విషయంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. యాదగిరి గుట్ట స్తంభాలపై టీఆరెస్ అధినేత, సీఎం అయిన కేసీఆర్ చిత్రంతో పాటు ఆ పార్టీ గుర్తు కారు బొమ్మ కూడా స్తంభాలపై చెక్కడం... కేసీఆర్, కేటీఆర్, కవితల పేర్లు కూడా ఆలయ స్తంభాలపై చెక్కడం రచ్చకు దారితీసింది. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం కానీ, టీఆరెస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఈ విషయం తెలంగాణ నుంచి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా పాకింది. కేసీఆర్, జగన్‌ల దోస్తానా నేపథ్యంలో ఏపీలో జనం ఈ విషయంపై జోకులేసుకుంటున్నారు.
యాదగిరి గుట్ట ఆలయ స్తంభాలపై తన చిత్రాన్ని చెక్కించుకున్న కేసీఆర్ పనిలో పనిగా తన మిత్రుడు జగన్ చిత్రాన్ని కూడా చెక్కించాల్సిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ వర్గాలు, వైసీపీ వ్యతిరేకుల నుంచి ఇలాంటి సెటైర్లు పడుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో ఈ విషయం పెద్ద చర్చకు దారితీస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ దీన్ని వాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు కొందరు యాదాద్రి వెళ్లి పరిశీలించి వచ్చారు. అక్కడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అలాగే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రేపు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. యాదాద్రి పుణ్య క్షేత్రంలోని అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభాలపై కేసీఆర్ చిత్రం, టీఆర్ఎస్ గుర్తు చెక్కడం దారుణమని, రాజకీయాలకు చోటివ్వడం ద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ఈ చర్యతో కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆ లేఖలో విమర్శించారు.