కేసీఆర్ కు మరో పొలిటికల్ టెన్షన్

June 04, 2020
CTYPE html>
తెలంగాణలో అధికార పార్టీ తెరాసతో పాటు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మింగుడుపడని నిజామాబాద్ లో మరో ఆసక్తికర ఎన్నికకు రంగం సిద్ధమైంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సొంత కూతురు కవిత ఓటమితో కంగు తిన్న కేసీఆర్ కు... నిన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ నిజామాబాద్ ఓటర్లు మరో షాకిచ్చారు. నగర పాలక సంస్థలో మెజారిటీ సీట్లను బీజేపీకి కట్టబెట్టిన నిజామాబాద్ ఓటర్లు... త్వరలో జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎటు వైపు మొగ్గు చూపుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది. 
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా గతంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన భూపతి రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కు షాకిచ్చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ ఇచ్చిన ఈ ఫిర్యాదుపై మండలి చైర్మన్ చాలా వేగంగానే స్పందించి భూపతిరెడ్డిపై వేటు వేశారు. అయితే తాను టీఆర్ఎస్ గుర్తుపై గెలవలేదని, చైర్మన్ నిర్ణయం చెల్లదని భూపతిరెడ్డి కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు కూడా చైర్మన్ నిర్ణయం సబబేనని తేల్చడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా భూపతి రెడ్డి కొనసాగేందుకు అనర్హుడని తేలిపోయింది. ఈ క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం... నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు గురువారం షెడ్యూలు జారీ చేసింది. ఈ ఎన్నికలకు మార్చి 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి.. ఏప్రిల్ 7వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది.
నిజామాబాద్ లో ఇటీవలి కాలంలో బీజేపీ హవా అంతకంతకూ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మార్పు అంతగా కనిపించకున్నా... లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి ఓ రేంజిలో ఊపేసిన బీజేపీ... నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవితను ఓడించేసింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ వ్యూహాత్మకంగా వ్యవహరించి కవితను మట్టి కరిపించారు. ఆ తర్వాత నిజామాబాద్ పై మరింతగా పట్టు బిగించేసిన అరవింద్... మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మరో గట్టి షాకిచ్చారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కేసీఆర్ తో బస్తీ మే సవాల్ అన్న రీతిలో చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అరవింద్ తనదైన వ్యూహాన్ని అమలు చేయడం పక్కానే అన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి, మరి అరవింద్ వ్యూహాలను బద్దలు కొట్టి ఈ సారైనా టీఆర్ఎస్ అక్కడ విజయం సాధిస్తుందో.. లేదంటే బీజేపీ చేతిలో మరో పరాభవాన్ని మూటగట్టుకుంటుందో చూడాలి.