కేసీఆర్ భ‌య‌ప‌డ్డారు అనేందుకు ఇంత‌కంటే ఏం కార‌ణం కావాలి?

February 26, 2020

తెలంగాణ‌లోనే కాకుండా...పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తేల్చేది, మ‌రోవైపు టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ప‌రువు ప్ర‌తిష్టల‌ను కాపాడేది ఈ ఎన్నికే అనే ప్ర‌చారం ఇప్ప‌టికే జోరుగా సాగుతోంది. ఇంత‌టి ముఖ్య‌మైన ఎన్నిక సంద‌ర్భంగా సాగుతున్న‌ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనాల్సిన బహిరంగసభ హ‌ఠాత్తుగా ర‌ద్ద‌యింది. బలమైన ఈదురుగాలు, భారీవర్షం కారణంగా స‌భ‌ రద్దయిందని టీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న‌ప్ప‌టికీ....సోష‌ల్ మీడియాలో మాత్రం మ‌రోర‌కంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.
సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్‌నగర్ బహిరంగసభకు హాజరుకావాల్సి ఉంది. పార్టీ అధినేత హాజరవుతుండటంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీసంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కేసీఆర్ రాక‌కు కాస్త ముందు...మెరుపులతో కూడిన భారీవర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఏవియేషన్ అధికారులు సీఎం హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించడంతో సభ రద్దయినట్టు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సభా వేదికపై ప్రకటించారు. అయితే, కేసీఆర్ త‌లుచుకుంటే...నిజంగా ఈ స‌భ‌కు ఖ‌చ్చితంగా హాజ‌రు అయ్యేవార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.
కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్ స‌భ‌కు గైర్హాజ‌ర‌వ‌డం వెనుక వాతావరణం అనుకూలించలేదు అనే కార‌ణ‌మే నిజ‌మైతే..రోడ్డు మార్గాన హుజూర్‌న‌గ‌ర్ వ‌ర‌కూ ప్ర‌యాణించ‌వ‌చ్చు. కేవలం 200 కిలోమీటర్ల దూరం ఉన్న హుజూర్‌నగర్‌కు రోడ్డు మార్గం ముఖ్య‌మంత్రి వెళ్ల‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. వాతావ‌ర‌ణం కంటే ఆర్టీసీ స‌మ్మె ముఖ్య‌కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ మంత్రులను కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే అడ్డుకుంటున్నారు. మంత్రుల పరిస్థితే తనకు కూడా పడుతుందేమో... చేదు అనుభవం ఎదురవుతుందేమో...అనే ఆలోచ‌న‌తో కేసీఆర్  హుజూర్‌న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న ర‌ద్దుచేసుకున్నార‌ని అంటున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నిరసన సెగ తగులుతుందేమో అనే భయం వెంటాడమే పర్య‌ట‌న‌ ర‌ద్దుకు కార‌ణ‌మ‌ని ప‌లువురు ప్ర‌చారం చేస్తున్నారు.