టీఆర్ఎస్‌కు టెన్ష‌న్‌గా మారిన గ‌వ‌ర్న‌ర్ దూకుడు

November 19, 2019

తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌ల చేప‌ట్టిన సౌంద‌ర‌రాజ‌న్ త‌న మార్క్ చూపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈక్ర‌మంలో ప్ర‌జాద‌ర్బార్ పేరుతో సామాన్య ప్ర‌జ‌లు క‌లిసేందుకు కూడా ఆమె సిద్ధ‌మ‌వుతున్నారు. అంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మాంతరంగా త‌న మార్క్ పాల‌న చూపించేందుకు సౌంద‌ర‌రాజ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ అనగానే కేవ‌లం రాజ్‌భ‌వ‌న్‌కే ప‌రిమితం కాకుండా ప్ర‌జా స‌మ‌స్య‌లు, ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి సారించే దిశ‌గా ఆమె క‌దులుతున్నారు. ఈ ప‌రిణామాలతో రాష్ట్ర ప్రభుత్వానికి.. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది.
ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా వ‌చ్చిన న‌ర‌సింహ‌న్.. మొన్న‌టి వ‌ర‌కూ కొన‌సాగారు.  రాష్ట్ర విభ‌జ‌నకు ముందు కొంచెం అటు ఇటుగా ఉన్న న‌ర‌సింహ‌న్‌.. ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్‌కు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించారు. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉంది. గ‌వ‌ర్న‌ర్‌గా న‌ర‌సింహ‌న్ ఏనాడు కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జోక్యం చేసుకోలేదు. ఏనాడు కూడా సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కేసీఆర్ ఏం చెబితే.. దానికి సై అన్నార‌నే చెప్పొచ్చు. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ పాల‌న సాఫీగా సాగింది.
అయితే.. నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా సౌంద‌ర‌రాజ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపిస్తోంది. కేవ‌లం రాజ్‌భ‌వ‌న్‌కే ప‌రిమితం కాకుండా నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి, వారి క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకునే దిశ‌గా సౌంద‌ర‌రాజ‌న్ అడుగులు వేస్తున్నారు. ప‌లు అంశాలపై నివేదిక‌లు కోర‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయి. ముఖ్యంగా డెంగీ, విష‌జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు, డెంగ్యూ ఫీవర్లపై గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర‌రాజ‌న్ నివేదిక కోర‌డంతో అధికార‌యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది.
ఇందులో ప్ర‌ధానంగా హైదరాబాద్ లో పెరిగిపోతున్న డెంగీ బాధితులు, మరణాలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా వైద్య-ఆరోగ్య శాఖను గ‌వ‌ర్న‌ర్‌ కోరారు. దీంతో సంబంధిత శాఖాధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. నివేదిక‌ను రూపొందించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. అంతేగాకుండా.. ఇంట‌ర్ ఫ‌లితాల్లో చోటుచేసుకున్న అవ‌క‌త‌వ‌క‌ల‌తో ప‌లువురు విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. దీనిపై కూడా గ‌వ‌ర్న‌ర్ ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా నీటిపారుద‌ల శాఖ‌.. త‌దిత‌ర శాఖ‌ల‌పై నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు గ‌వ‌ర్న‌ర్‌. ఏదేమైనా ఈ ప‌రిణామాలు గ‌వ‌ర్న‌ర్ భ‌విష్య‌త్తులో పాల‌న‌ప‌రంగా జోక్యం చేసుకుంటారా ? అన్న సందేహాల‌కు ఊత‌మిస్తుండ‌గా... అదే టైంలో ఇటు గ‌వ‌ర్న‌ర్ దూకుడు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంది.