కేసీఆర్, జగన్... ష్! గప్ చుప్

July 06, 2020

ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ్డాయి. చంద్ర‌బాబు.. కుమార‌స్వామి.. మ‌మ‌తా బెన‌ర్జీలాంటి శ‌క్తివంత‌మైన పార్టీ అధినేత‌లు క‌మ్ ముఖ్య‌మంత్రులు రియాక్ట్ అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ లో మాదిరి కాకుండా త‌మ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేశారు. క‌ట్ చేస్తే.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలు ఒకేలా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
ఈ ఇరువురు అధినేత‌లు ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని అత్య‌ధిక మీడియా సంస్థ‌లు త‌మ ఎగ్జిట్ పోల్స్ లో వెల్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ.. ఈ ఇరువురు నేతలు గుంభ‌నంగా ఉండ‌టం కనిపిస్తుంది. వాస్త‌వానికి కేసీఆర్ త‌ర‌చూ మాట్లాడ‌టం క‌నిపించ‌దు. స‌మ‌యం.. సంద‌ర్భం రెండూ చూసుకున్నాక మాత్ర‌మే ఆయ‌న మాట్లాడ‌టం క‌నిపిస్తుంటుంది.
ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అట్టే మాట్లాడింది లేదు. మాట్లాడిన ఒకట్రెండు సార్లు పొడిపొడిగా మాట్లాడ‌ట‌మే త‌ప్పించి.. ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. తాజాగా విడుద‌లైన ఎగ్జిట్ ఫ‌లితాల మీద ఆయ‌న మౌనంగానే ఉన్నారు. ఈ ఇద్ద‌రు నేత‌ల తీరు ఒకేలా ఉండ‌టం.. వీలైనంత మౌనాన్ని.. అవ‌స‌రానికి మించి త‌క్కువ మాట‌ల్ని మాట్లాడుతున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. ఏమైనా.. అంద‌రూ రియాక్ట్ అవుతున్న వేళ కూడా ఇద్ద‌రు అధినేతల మౌనం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క‌తప్ప‌దు.